calender_icon.png 6 August, 2025 | 4:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేషన్‌కార్డుల పంపిణీలో ప్రొటోకాల్ పంచాయితీ

06-08-2025 01:50:20 AM

  1. స్టేజీపైకి కాంగ్రెస్ మాజీ ప్రజాప్రతినిధులు
  2. కార్యక్రమాన్ని బహిష్కరించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి 
  3. నేలపై కూర్చొని నిరసన
  4. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతల మధ్య వాగ్వాదం 
  5. బీఆర్‌ఎస్ హయాంలో ప్రొటోకాల్ పాటించారా?
  6. నిలదీసిన మంత్రి శ్రీధర్‌బాబు

మేడ్చల్, ఆగస్టు 5 (విజయక్రాంతి)/బడంగ్‌పేట్: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండలం మల్లాపూర్‌లో మంగళవారం నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం లో ప్రొటోకాల్ రగడ రేగింది. ఐటీ, పరిశ్రమలు, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హాజరైన ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులను సభ వేదికపైకి పిలవడంతో మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు.

అధికార కార్యక్రమంలో కేఎల్‌ఆర్, బడంగ్‌పేట్ మాజీ మేయర్ పారిజాత నరసింహారెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ తీగల అనితారెడ్డి ఎలా కూర్చుంటారని ఎమ్మెల్యే ప్రశ్నించారు.  నియోజకవర్గంలో ఇది వరకే రేషన్‌కార్డులు పంపిణీ జరిగినా మళ్లీ మళ్లీ అధికార కార్యక్రమం ఎలా నిర్వహిస్తారు అంటూ బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన నేతలు ప్రశ్నించారు. దీంతో ఇరు పార్టీల నాయకులు పోటా పోటీగా నినాదాలు చేశారు.

మంత్రి శ్రీధర్‌బాబు ఇరు వర్గాలను సముదాయించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి రెండు పార్టీల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. అంతలోనే సబితా ఇంద్రారెడ్డి.. ఎమ్మెల్సీ సురభి వాణిదేవితో కార్యక్రమాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెసోళ్లు ప్రొటోకాల్ పాటించరా? అని ప్రశ్నించారు. తాను మహేశ్వరం ఎమ్మెల్యేను అని, తనకు స్టేజీపై కూర్చునే అర్హత లేదా అంటూ ఫైర్ అయ్యారు.

కాంగ్రెస్ నేతల తీరును ప్రశ్నిస్తూ నేలపై కూర్చొని నిరసనకు దిగారు. కాంగ్రెస్ నాయకులు పోలీస్ బెటాలియన్ మధ్య కార్డులను ఎందుకు పంపిణీ చేస్తున్నారని ప్రశ్నించారు. అభివృద్ధి కార్యక్రమాలకు తాము వ్యతిరేకం కాదని, అంతకుముందే కార్డులు పంపిణీ చేసినా మళ్లీ ఇంత హంగామా ఎందుకని ఆమె నిలదీశారు.  ప్రభుత్వ కార్యక్రమమా? కాంగ్రెస్ పార్టీ కార్యక్రమమా అని ప్రశ్నించారు. పార్టీ కార్యక్రమా లు గాంధీ భవన్‌లో చేసుకోవాలని చురకలాంటించారు. అనంతరం మంత్రి రేషన్ కార్డులు పంపిణీ చేశారు.  

బీఆర్‌ఎస్ హయాంలో ప్రొటోకాల్ ఏమైంది?

మంత్రి శ్రీధర్‌బాబు.. బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు పంపిణీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ నేతలు ప్రొటోకాల్ పాటించారా అని నిలదీశారు. మీరా ప్రొటోకాల్ గురించి మాట్లాడేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో తాను ఎమ్మెల్యేగా పని చేశానని ఎప్పుడు ప్రొటోకాల్ పాటించలేదని విమర్శించారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఇలాంటి గలాటా చేయడం భావ్యం కాదని ఆయన హితవు పలికారు.

పేదల అభ్యున్నతే లక్ష్యంగా రాష్ర్టంలో ప్రభుత్వం పాలన సాగుతోందని, అందులో భాగంగా పేదలకు రేషన్ కార్డులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ నగరానికి ముఖ్యమం త్రి గోదావరి నీటిని తీసుకురావడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారని అన్నారు. మేడ్చల్  మండలంలోని అత్వెల్లిలోనూ మంత్రి శ్రీధర్‌బాబు రేషన్‌కార్డుల ను పంపి ణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి,  గంధ్రాలయ  చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.