calender_icon.png 6 August, 2025 | 4:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంఘం పేరిట గీత దాటుతుండ్రు!

06-08-2025 01:11:03 AM

  1. అవినీతిమయమైన ‘గీతా పారిశ్రామిక సహకార సంఘం’
  2. ఒకరి కనుసన్నుల్లో తతంగమంతా!
  3. మంచిర్యాలలో గ‘లీజు’ అగ్రిమెంట్లు
  4. గౌరవ సభ్యుల వేతనాల పేరిట నెలకు రూ.2.80 లక్షలు
  5. ప్రజావాణిలో సభ్యుడి ఫిర్యాదుతో వెలుగులోకి

మంచిర్యాల, ఆగస్టు 5 (విజయక్రాంతి): మంచిర్యాలలోని రిజిస్టర్డ్ ప్రాథమిక కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘంలో అవినీతి రాజ్యమేలుతుంది. లక్షలకు లక్షలు దండుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. వివిధ పార్టీలలో పని చేసిన ఒక నాయకుడు తనను తాను కన్వీనర్‌గా ప్రకటించుకొని అనేక అవకతవలకు పాల్పడుతూ అమాయక కల్లుగీత కార్మికులపై పెత్తనం చెలాయి స్తున్నాడని పలువురు సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఏండ్లకు ఏండ్లుగా లక్షల రూపాయ లు తీసుకుంటుండటంతో సంఘానికి ఇప్ప టి వరకు సంఘానికి కనీసం ఒక భవనం నిర్మించడానికి కూడా స్థలం, ఇన్ ఫ్రా కూడా లేని దుస్థితిలో ఉంది. సంఘంలో అవినీతి దందా ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది.

మంచిర్యాల టీసీఎస్‌లో 10 దుకాణాలు

మంచిర్యాల ట్యాపర్ కో ఆపరేటివ్ సొసైటీ (టీసీఎస్) పరిధిలో పది తెల్లకల్లు విక్రయించే దుకాణాలున్నా యి. బీట్ బజార్, పెట్రోల్ పంపు ఏరియా, లక్ష్మీ టాకీస్, ఏసీసీ ఏరియా, మేదరి వాడ, పాత మంచిర్యాల, రైల్వే స్టేషన్  ఏరియా, హమాలి వాడ, పోచమ్మ గుడి ఏరియా, చెన్నూర్ గేట్ ఏరియాలలో అధికారికంగా ఈ సొసైటీ లీజు దారుడు తెల్ల కల్లు విక్రయించేందుకు అనుమతి ఉంది.

115 మంది సభ్యులతో ప్రారంభమై..

మంచిర్యాల ప్రాథమిక కల్లు గీత పారిశ్రామిక సహకార సంఘం 115 మంది సభ్యుల తో ప్రారంభమైంది. ప్రస్తుతం సంఘ సభ్యు ల సంఖ్య 144 వరకు చేరుకుంది. ఈ సొసై టీ తరపున వచ్చే లాభాలు సభ్యులందరికీ పంచుతుంటారు. ఇది వరకు భాగానే ఉన్నా కొందరు అనధికారికంగా పదవులు సృష్టించుకొని గౌరవ సభ్యుల పేరిట లక్షల రూపా యలు దండుకుంటున్నారని, అనేక ఆర్థిక అవకతవకలకు పాల్పడుతూ సభ్యులకు రావాల్సిన డబ్బులకు గండి కొడుతున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు వైద్యులకు, ప్రభుత్వ ఉద్యోగం చేసిన వారి కి, చిన్న పిల్లలకు సభ్యత్వం ఇస్తూ సంఘా న్ని బలహీన పరుస్తున్నాడని, అది ఆయన స్వార్థ్యం కోసమేనని దుయ్యబడుతున్నారు.

గ‘లీజు’ అగ్రిమెంట్లు

మంచిర్యాల గీత పారిశ్రామిక సహాకార సంఘం ఆధ్వర్యంలో 2024 సెప్టెంబర్ 18న సర్వసభ్య సమావేశం నిర్వహించి సొసైటీ తరఫున కల్లు అమ్ముకునేందుకు రెండు సంవత్సరాలకు గుర్రం రాజేందర్‌గౌడ్‌కు లీజుకు ఒప్పందం చేసుకున్నారు. మొదటి సంవత్సరానికి సంఘానికి రూ.12.50 లక్షలు (మొదటి విడత రూ.6.50 లక్షలు, రెండో విడత రూ.6 లక్షలు), రెండో ఏడాది రూ.13.25 లక్షలు (మొదటి విడత రూ. 6.75 లక్షలు, రెండో విడత రూ. 6.50 లక్షలు)గా తీర్మాణించారు. ఈ డబ్బులను సంఘ సభ్యులుగా ఉన్న వారందరికి విడతల వారిగా చెల్లించాల్సి ఉంటుంది. ఇక్కడి వరకు భాగానే ఉన్న అదనంగా రూ.2.80 లక్షలు నెల నెలా లీజుకు తీసుకున్న వారు కన్వీనర్‌కు చెల్లించాలని అగ్రిమెంటులో రాసుకున్నారు.

2.80 లక్షలు కన్వీనర్‌కు ఎందుకు?

గీత పారిశ్రామిక సంఘంలో అధికారికంగా బైలా ప్రకారం సంఘం అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ముగ్గురు డైరెక్టర్లుగా మాత్ర మే (ఫైవ్ మెన్ కమిటీ) ఉంది. మరి ఈ కన్వీనర్ పోస్టు ఎక్కడిదో అర్థం కాని ప్రశ్న. ఈ పోస్టుకు రూ.2.80 లక్షలు ఎందుకు చెల్లించాలనేది చాలా వరకు సభ్యులకే తెలియక పోవడం గమనార్హం. అసలు సంఘం సమావేశాలు జరుగవు, కనీసం ఆడిట్ జరుగు తుందా? లేదో కూడా తెలియదు. ఇలా ఏడాదికి లక్షలతో పాటు నెల నెలకు లక్షలు వస్తుంటే వీటికి లెక్క పత్రం ఉండదా? అని పలువురు సభ్యులు ప్రశ్నిస్తున్నారు.

లీజుదారుడే అన్ని భరించాలి!

కల్లు దుకాణాలు ఎవరైతే లీజు తీసుకుంటారో వారే ఏడాదికి లీజుతో పాటు నెల నెలా రూ.2.80 లక్షలు, నెల నెలా దుకాణాల కిరాయి, అందులో పని చేసే వారికి జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది. లీజు డబ్బులు సభ్యులందరికి పంచుతుండగా, నెల నెలా వచ్చే రూ.2.80 లక్షలు అంటే ఏడాదికి రూ.33.60 లక్షలు ఏమవుతున్నదనే ప్రశ్న తలెత్తుతున్నది. ఈ విషయమై ఎవరిని అడిగినా అంతా కన్వీనర్‌కే తెలుసు అనే సమాధానం ఇస్తున్నారు. ఈ విషయమై కన్వీనర్‌గా ఉన్న గాజుల ముఖేష్‌గౌడ్‌ను వివరణ కోరగా గౌరవ సభ్యుల వేతనాల పేరిట నెలకు రూ.2.80 లక్షలు ఖర్చు చేస్తున్నామని జవాబిచ్చారు. 

సభ్యులందరికి న్యాయం చేయండి 

మా సంఘానికి కన్వీనర్‌గా ప్రకటించుకొని, సంఘంలో తాను చెప్పిందే వేదంగా, అదే చట్టంగా అమలు చేస్తూ సంఘ సభ్యులకు ఎలాంటి హక్కులు, అధికారాలు లేకుండా చేస్తూ, తన సేవలకు నెలకు రూ.2,80 లక్షలు తీసుకుం టూ పెత్తనం చెలాయిస్తున్నాడు. సంఘ సభ్యులకు ఏడాదికి లీజు నుంచి డబ్బులిస్తున్నాడే తప్ప నెల నెలా తీసుకున్న డబ్బులు ఎవరికి ఇస్తున్నాడో తెలియ దు. మా సంఘానికి ఆయన చేస్తున్న సేవలు ఏమిటో మాకు అర్ధం కావడం లేదు. మా సంఘానికి ఇంత వరకు సెంటు భూమి లేదు. ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలి.

 కోల రాజాగౌడ్, సంఘ సభ్యుడు, మంచిర్యాల