06-08-2025 12:22:13 AM
ఇదేతీరునే ఇటుక, సిమెంట్, స్టీల్
రెట్టింపవుతున్న సామగ్రి ధరలు
పనిచేయని నియంత్రణ కమిటీలు
ముందుకుసాగని ఇళ్ల నిర్మాణాలు
సంగారెడ్డి, ఆగస్టు 5(విజయక్రాంతి): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై ధరల ప్రభావం తీవ్రంగా పడుతోంది. ఇటుక, సిమెంట్, ఇసుక, స్టీల్, కంకర తదితర సామగ్రి ధరలు రెండు నెలల వ్యవధిలోనే అమాంతం పెరిగాయి. దీంతో నిర్మాణ పనులు ప్రారంభించేందుకు లబ్దిదారులు వెనుకడుగు వేస్తున్నారు.
సంగారెడ్డి, మెదక్ జిల్లాలలో ధరల నియంత్రణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించినా ఆ దిశగా అడుగుపడలేదు. ప్రభుత్వం మంజూరు చేయనున్న బిల్లు సరిపోయే పరిస్థితి లేక అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెట్టింపైన ఇసుక ధర...
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుక పెనుభారంగా మారింది. రెండు నెలల వ్యవధిలోనే ధర రెట్టింపైంది. ఈ ఏడాది మే వరకు ట్రాక్టర్ ఇసుక రూ.3వేల నుంచి రూ.3,500కు లభ్యమైంది. ప్రస్తుతం రూ.5,500 నుంచి రూ.6వేలకు పెరిగింది. జిల్లా కేంద్రంలో రూ.5,500కు ట్రాక్టర్ ఇసుక విక్రయిస్తుండగా రవాణా దూరం పెరిగిన కొద్దీ ధర మరింత పెంచి విక్రయిస్తున్నారు.
ప్రభుత్వం లబ్దిదారులకు ఉచితంగా ఇసుక అందిస్తామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో నదీ పరీవాహక ప్రాంతాల నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. మున్ముందు భారీ వర్షాలు కురిసినట్లయితే వాగుల్లో నీటి ప్రవాహం పెరిగి ఇసుక లభ్యత కూడా తగ్గే అవకాశముంది. దీంతో రానున్న రోజుల్లో ఈ ధర మరింతగా పెరిగే అవకాశముంది.
మొక్కుబడిగా కమిటీలు...
లబ్దిదారులకు తక్కువ ధరకు సామగ్రి అందించేలా చూసేందుకు ప్రభుత్వం జిల్లా, మండల స్థాయిలో ప్రత్యేక ధరల నియంత్రణ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మండల స్థాయిలో ఎంపీడీవో, తహసీల్దార్, హౌసింగ్ ఏఈ, కార్మికశాఖ అధి కారులతో కూడిన కమిటీ ఉండగా, జిల్లా స్థాయిలో ఆడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ), ఏడీ మైనింగ్, హౌసింగ్ పీడీ, జెడ్పీ సీఈవో, కార్మికశాఖ సహాయ కమిషనర్ తో కూడిన ధరల నియంత్రణ కమిటీ ఏర్పా టుకు ఆదేశించింది.
అయితే జిల్లాలో కమిటీలు మొక్కుబడిగా మారాయి. ఇప్పటివరకు ఎలాంటి సమీక్షా సమావేశాలు నిర్వహించలేదు. తనిఖీలు చేపట్టిన దాఖలాలూ లేవు. దీంతో నిర్మాణ సామగ్రి దుకాణాలు, ఇటుక బట్టీలపై ఎలాంటి పర్యవేక్షణ లేక ధరలు అదుపులో ఉండడంలేదు. ఫలితంగా లబ్దిదారులపై అదనపు భారం పడుతోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు ధరలు కట్టడి చేసేలా చర్యలు తీసుకోవాలని లబ్దిదారులు కోరుతున్నారు.
ఇదే బాటలో స్టీల్, సిమెంట్...
ఇసుకే కాదు.. ఇంటి నిర్మాణాలకు అవసరమైన సిమెంట్, కంకర, ఇటుక తదితర సామగ్రి ధరలూ చాలా పెరిగాయి. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్నాయి. ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ ప్రక్రియ పూర్తి కావస్తుండటంతో లబ్దిదారులు నిర్మాణాలు ప్రారంభిస్తున్నారు. ప్రస్తుతం బస్తా సిమెంట్ ధర రూ.310 నుంచి రూ.330వరకు ఉండగా, క్వింటాల్ స్టీల్ రూ.5,700 నుంచి రూ.6వేలు పలుకుతోంది.
కంకర టిప్పర్ కు రూ.3,100కు విక్రయిస్తు న్నారు. నెల క్రితం వరకు రూ.14వేలకు లభ్యమైన ట్రాక్టర్ ఇటుక ప్రస్తుతం రూ.15వేలకు చేరింది. జిల్లా కేంద్రంలో ఈ ధరలు ఉండగా రవాణా దూరం పెరిగే కొద్దీ మరింత పెంచుతున్నారు. జిల్లాలోని ఏ ఒక్క ఇటుక బట్టీకి ప్రభుత్వ అనుమతి లేకపోయినా ధరలపై నియంత్రణ లేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది.