calender_icon.png 19 October, 2025 | 3:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెర్త్‌లో ఎర్త్ ఎవరికో ?

19-10-2025 12:00:00 AM

నేడు భారత్, ఆస్ట్రేలియా తొలి వన్డే

-రోహిత్, కోహ్లీపైనే అందరి చూపు

-మ్యాచ్‌కు పొంచి ఉన్న వర్షం ముప్పు

పెర్త్, అక్టోబర్ 18: భారత వన్డే క్రికెట్‌లో సరికొత్త శకానికి తెరలేవబోతోంది. కొత్త కెప్టె న్ శుభ్‌మన్ గిల్ తొలిసారి వన్డే ఫార్మాట్‌లో జట్టును లీడ్ చేయబోతున్నాడు. మిషన్ వన్డే ప్రపంచకప్‌కు  ఆస్ట్రేలియా టూర్ నుంచే శ్రీ కారం చుట్టిన టీమిండియా ఆదివారం పెర్త్ వేదికగా తొలి వన్డే ఆడబోతోంది. మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్ గెలిచి శుభారం భం చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ప్రపంచ క్రికెట్‌లో రెండు అత్యుత్తమ జట్లు తలపడుతుండడంతో క్రికెట్ అభిమానుల్లో ఎక్కడలేని ఆసక్తి నెలకొంది. నిజానికి భారత్, ఆసీస్ ఏ ఫార్మాట్‌లో తలపడినా హోరాహోరీ పోటీనే ఉంటుంది. ప్రస్తుతం ఈ సిరీ స్ కూడా నువ్వా నేనా అన్నట్టు సాగడం ఖా యం.

అయితే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపైనే అందరి చూపు ఉంది. టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన తర్వాత వన్డేల్లో మాత్రమే ఆడుతున్న రోకో ద్వయం మళ్ళీ చాలారోజులకు గ్రౌండ్‌లో అడుగుపెడుతోంది. వన్డే ప్రపంచకప్ ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్న రోహిత్, కోహ్లీ ఈ సిరీస్‌లో రాణించడంపైనే వారి ఫ్యూచర్ డిసైడ్ కాబోతోంది. అదే సమయంలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు కూడా ఈ సిరీస్ పరీక్షగానే చెప్పాలి. ఇంగ్లాండ్ టూర్ లో టెస్ట్ కెప్టెన్‌గా ఆకట్టుకున్న గిల్ ఇప్పుడు వన్డే ఫార్మాట్‌లో జట్టును ఎలా నడిపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.

తుది జట్టు కూర్పును చూస్తే ఓపెనర్లుగా గిల్, రోహిత్ రానున్నారు. వన్ డౌన్‌లో విరాట్ కోహ్లీ.. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ బ్యాటింగ్‌ను నడిపించనున్నారు. రాహుల్ వికెట్ కీపింగ్ బాధ్యతలను కూడా తీసుకున్నాడు. ఆరో స్థానంలో తెలుగుతేజం నితీష్ కుమార్ రెడ్డిపై అంచనాలున్నాయి. పాండ్యా స్థానంలో వచ్చిన నితీష్ ఈ అనకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. మరోవైపు బౌలింగ్ కాంబినేషన్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. సాధారణంగా ఆసీస్ పిచ్ లు ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉం టాయి. పెర్త్ వికెట్ కాస్త బ్యాటర్లకు కూ డా అనుకూలిస్తుంది. దీంతో ఆల్‌రౌండర్లకు ఎక్కువ ప్రాధాన్యతనివ్వొచ్చు. అయితే స్పిన్ విభాగంలో అక్షర్ పటేల్‌కు చోటు ఖాయం. మరో స్పిన్నర్‌గా వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్‌లో ఒకరికే ప్లేస్ ఉంటుంది. పేస్ విభాగాన్ని సిరాజ్ లీడ్ చేయనుండగా.. అర్షదీప్‌సింగ్‌తో పాటు మూడో పేసర్‌గా హర్షిత్ రాణా లేదా ప్రసిద్ధ కృష్ణలలో ఒకరికి చోటు దక్కుతుంది.

మరోవైపు ఆస్ట్రేలియాను వరుస గాయా లు వెంటాడుతున్నాయి. ప్యాట్ కమ్మిన్స్ లేకపోవడంతో మిఛెల్ మార్ష్ సారథిగా బాధ్య తలు తీసుకున్నాడు. కామెరూన్ గ్రీన్, మాక్స్‌వెల్ గాయాలతో దూరమవగా...ఆడమ్ జంపా తొలి వన్డేకు  అందుబాటులో లేడు. అయినప్పటకీ ఆసీస్ పేస్ ఎటాక్ బలంగానే ఉంది. హ్యాజిల్‌వుడ్, మిఛెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్ కీలకం కానున్నారు. జంపా స్థానంలో మమ్యాట్ కునే మన్ స్పిన్నర్‌గా రానున్నాడు. మ్యాట్ రెన్షా, మిఛ్ ఓవెన్ ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేయనున్నారు. 

గత రికార్డులు : ఓవరాల్‌గా ఇరు జట్లు 152 మ్యాచ్‌లలో తలపడితే ఆసీస్ 84, భారత్ 58 సార్లు గెలిచాయి. 10 మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు. 

పిచ్ రిపోర్ట్ : పెర్త్ పిచ్ సాధారణంగా ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. ఈ పిచ్‌పై పరుగులు చేసేందుకు బ్యాటర్లు ఇబ్బంది పడుతుంటారు. షాట్ సెలక్షన్‌లో తెలివిగా ఉండి, ఓపిగ్గా ఆడకుంటే మాత్రం తక్కువ స్కోరుకే పరిమితమవ్వాల్సి ఉంటుంది.

వర్షం ముప్పు : ఈ మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా నిలిచే అవకాశాలున్నాయి. వెదర్ రిపోర్ట్ ప్రకారం ఆదివారం 63 శాతం వర్షం పడే అవకాశమున్నట్టు తెలుస్తోంది.దీంతో మ్యాచ్‌కు పలుసార్లు అంతరాయం కలగవచ్చు.

భారత్ తుది జట్టు (అంచనా): గిల్(కెప్టెన్), రోహిత్, కోహ్లీ, శ్రేయాస్,రాహుల్(కీపర్) ,నితీష్,అక్షర్ పటేల్,వాషింగ్టన్ సుందర్/కుల్దీప్,సిరాజ్,అర్షదీప్,హర్షిత్ రాణా/ప్రసిద్ధ కృష్ణ

ఆస్ట్రేలియా తుది జట్టు (అంచనా): హెడ్, మిఛెల్ మార్ష్(కెప్టెన్), షార్ట్, రెన్‌షా, ఫిలిప్(కీపర్), మిఛ్ ఓవెన్, కన్నోల్లీ, స్టార్క్, ఎల్లిస్, కునేమన్,హ్యాజిల్‌వుడ్