calender_icon.png 5 November, 2025 | 9:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముందెవరి నెదిరించాలి?

22-10-2025 12:00:00 AM

బలవంతమన్యాయవృత్తిం 

దుర్బలం వా న్యాయవృత్తిం

ఇతి బలవంతమన్యాయవృత్తిం యయాత్...

(కౌటిలీయం - 7- అన్యాయంగా ప్రవర్తించే బలవంతుడైన శత్రువు, న్యాయంగా ప్రవర్తించే దుర్బలుడైన శత్రువుల్లో ఎవరి పైకి ముందుగా యుద్ధానికి వెళ్లాలన్నప్పుడు.. సాధారణం గా బలహీనుడిపై దాడి చేయాలని చాలా మంది అనుకుంటారు. దానికి కారణాలు గా.. వారిపై గెలుపు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని, బలవంతుల సమూహంలోని వారిలో ఆత్మస్థుర్యైన్ని తగ్గించి.. స మూహంలో చీలికలు తెస్తుందని, బలహీనులపై యుద్ధంలో వనరుల వినియోగం తక్కువగా ఉంటుందని పలు కారణాలను చెపుతారు.

కానీ ఆచార్య చాణక్య, అన్యాయంగా పవర్తించే బలవంతునిపైకే ముం దుగా వెళ్ళాలని చెపుతున్నాడు, దానికి కారణం.. అన్యాయంగా ప్రవర్తించే శత్రువును ఎదుర్కొనేందుకు ప్రకృతులు అంటే ప్రజలు సహాయపడతారు.. దేశ ప్రజలే కా దు.. బలవంతుడైన వానిచే భంగపడిన వా రంతా సహాయంగా నిలుస్తారు.; అదే బలహీనుడు, న్యాయవర్తనుడైన వేళ, ఆ రాజ్య ప్రజలు రాజుని ప్రేమిస్తారు. అతన్ని రక్షించడానికి బలంగా అడ్డుకుంటారు. ధర్మా త్మునిపై దండెత్తడానికి దేశ ప్రజలు కూడా సాయపడరు. అంతేకాదు, బలవంతుడైన వానిని ఓడిస్తే.. బలహీనుడు తానే ఓటమిని ఒప్పుకొని సంధికై చేయిచాస్తాడు. అయితే నాయకుడు నిబద్ధతతో నిలవాలి.. చివరిదాకా పోరాడగలననే నమ్మకాన్ని ప్రజలకు కలిగించాలి, అంటారాయన.

‘ది ఆర్ట్ ఆఫ్ వార్’

జీవితంలోనైనా, రాజకీయాల్లోనైనా, వ్యాపారంలోనైనా, యుద్ధాలలోనైనా.. రం గమేదైనా చాణక్య ఆలోచనా విధానం పరిస్థితిని స్పష్టంగా అంచనా వేసుకునేందుకు సహాయపడుతుంది. పోరాటంలో అడుగుపెట్టే ముందే నిజాయితీగా తన శక్తి యుక్తు లను, బలాబలాలను, ఎదురవబోయే అ డ్డంకులను విస్తృతంగా ఆలోచించడమే కా క శత్రువు బలా బలాలను అంచనా వేసుకోవాలి. నిజానికదే.. విజయ సాధనలో మొదటిమెట్టు. విజయ సా ధనలో.. మంచి స్నేహితు లు, సాధనా సంపత్తి, వ్యవహార దక్షత, రాజనీతి కుశల త ముఖ్యమైన సాధనాలు గా భారతం చెబుతుంది. అయితే నిర్ణయం తీసుకోవడంలో అహంకారం.. అప జయానికి మార్గం చూపుతుంది. ఈనాడు ఏ దేశ మూ స్వతంత్రంగా నిలదొక్కుకోలేదు. పరస్పరాధా రి తమే ప్రయోజనకరం. వ్యక్తి ఎదుగుదల లేదా దేశాభ్యుదయాన్ని చూచి ఇతరులు ఈర్ష్యాసూయలు చెందడం సాధారణమే.

ఎదుగుదల నిష్పత్తిలో శత్రువులూ పెరుగుతారు. శత్రువు వ్యూహాలపై సరైన అవగాహన పెంచుకునే నాయకులు ఏనా డూ అపజయాన్ని పొందరు. బలవంతుడైన శత్రువు మనపై దండెత్తేందుకు అవకా శం కొరకు ఎదురు చూస్తుంటాడు.. అతనికా అవకాశం ఇవ్వకుండా ముందు గా దండెత్తుతేనే విజయావకాశాలు మెరు గ్గా ఉంటాయని ‘ది ఆర్ట్ ఆఫ్ వార్’ పుస్తక రచయిత.. యుద్ధవ్యూహ నిపుణుడు సన్ ట్జు చెపుతారు. వ్యాపారంలో, పరిశ్రమలో వ చ్చే మార్పులపై, పోటీదారుల కదలికలపై దృష్టి కేంద్రీకరించి మొదటగా స్పందించిన వారే విజయాన్ని సాధిస్తారు. వ్యాపారంలో లేదా రాజకీయాల్లో సమాన మనస్కులతో సంఘటించి బలీయమైన కూటమిగా ఏర్పడడం వల్ల పెద్ద శత్రువును ఎదుర్కోవడం సులువవుతుంది. అలాగే బలీయమైన శత్రువుకు సహాయపడే మి త్రులను సామదానభేద దండోపాయాలను ఉపయోగించి అతని నుంచి విడదీ యడం వల్ల శత్రువు బలహీనుడౌతాడు.

కుట్రలను తిప్పికొడుతూ

భారతదేశం ఆర్థికంగా, వైజ్ఞానికంగా, నైపుణ్యాలపరంగా, శక్తి సామర్ధ్యాల పరం గా వికసిస్తున్న సమయంలో భారతదేశ ప్రగతిని, చూచి సహించలేని దేశాలు భారతదేశానికి ఎన్నో ప్రతిబంధకాలను కల్పిస్తు న్నాయి. బాహిరంగా కొన్ని దేశాలు డబ్బులిచ్చి ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్స హించడం, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నాయి. అంతర్గతంగా దేశంలోని కొన్ని స్వార్ధపర శక్తులు దేశద్రోహానికి పాలుపడుతూ.. అస్థిరతను సృష్టి స్తూ అశాంతికి ఆజ్యం పోస్తున్నాయి. అయి నా ఆ కుట్రలను తిప్పికొడుతూ భారత్.. సమున్నతస్థానాన్ని నిలుపుకుంటున్నది. దానికి కారణం.. దేశప్రయోజనాలు మాత్ర మే ముఖ్యమనుకునే; నిబద్ధత కలిగిన నాయకత్వమే. సౌకర్యవంతమైన వలయం లో ప్రశాంతంగా ఉండే నాయకుడు విజ య సాధకుడు కాలేడు. ప్రమాదమని తెలి సీ దానికి ఎదురీదగలిగిన నాయకుడే చరి త్ర సృష్టిస్తాడు. అతనినే అన్ని వర్గాల ప్రజ లు ఆదరిస్తారు. ప్రజాదరణ పొందేందుకు అనునిత్యం ప్రజలతో మమేకం కావాలి. భావవ్యక్తీకరణ నైపుణ్యాన్ని ప్రయత్న పూర్వకంగానైనా సంతరించుకోవాలి.

నిరంతర కార్యాచరణశీలి యై తన బృందాన్ని ఉత్సాహం గా ముందుకు నడిపించాలి. అ త్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకో వడంలో ముందుం డాలి.; అందుబాటులో ఉన్న సమాచారాన్ని ప్రభావవంతంగా ఉపయోగించుకోవడం తెలిసి ఉండాలి. నిజానికి బాహ్య జగత్తులో సాధించే ఏ విజయమైనా అంతర్జగత్తులో నుంచి మాత్రమే వస్తుంది. నీవేం చేస్తున్నావో అది నీ వృత్తి.. ఎలా చేస్తున్నావనేది నీ ప్రవర్తన.. ఎందుకు చేస్తున్నావనేది అందులో ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. దీనిని తెలుసుకున్న నాయకుడు ఏ ప్రయత్నంలోనైనా విజయాన్ని సాధించడమే కాక జీవన ప్రయోజనాన్ని గుర్తించిన వాడవుతాడు. ప్రతి ఆలోచన, ప్రతిచర్య, అంతి మ లక్ష్యం వైపు సాగితే విజయంతో కూడిన ఆనందం స్వంతమౌతుంది. మానవ విలువలు, అధి భౌతిక సంబంధాలు, ద్వంద్వ ప్రకృతుల సమన్వయం, సర్వజీవ సమభావన, సా మాజిక, ఆర్థిక, రాజకీయ, ధార్మిక చైత న్యం, ఆత్మ సంయమనత లాంటి సార్వకాలిక లక్షణాలు జీవనగతులుగా చేసుకున్న నాయకుడు ఎంతటి శత్రువునైనా జయించగలుగుతాడు.

కత్తి పట్టే విధానం 

ప్రజల కష్టసుఖాలను వినగలిగిన సహనం కలిగిన వారినే ఉత్తమ నాయకులుగా; సమాజం గుర్తిస్తుంది. ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారు చెప్పే విషయాలు అవి సాంకేతిక పరమైనవైనా, సాధారణమైనవైనా శ్రద్ధగా వినాలి. నిజానికది స్వతహాగా అబ్బే కళ.. లేకపోయినా దానిని సంతరించుకోవడం అవసరం. అనుకరణ, అనుసరణ, అనుశాసన ద్వారా ఏదైనా అలవాటుగా మారుతుంది. భావోద్వేగాలను ముఖంపై కనిపించనీయకుండా జాగ్రత్తపడే నాయకుని పట్ల అనుచరులు సర్వదా సన్నద్ధంగా ఉంటారు. తన బృందానికి, తనను అనుసరించే సాధారణ ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చే ఏ అవకాశాన్నీ నాయకుడు జారవిడుచుకోకుండా ప్రజలతో కలసిపోవాలి. నాయకుడు ఎన్ని మంచి పనులు చేసినా, ఎందరిని మెప్పించగలిగినా విమర్శకులు ఉంటూనే ఉంటారు. వారిపై ఒక కన్నేసి ఉంచడం.. అవసరానుగుణంగా ప్రవర్తించడం అవసరం. అన్నింటి కన్నా ము ఖ్యంగా తానేం చెబుతున్నాడో దానిని ఆచరణలో చూపినప్పుడది సంస్థలో లేదా దేశంలో పని సంస్కృతిగా మారుతుంది. పనిలో నైపుణ్యంతో పాటుగా నైతికత ఉంటేనే పని సంస్కృతి అనబడుతుంది. నైతికతలేని దొంగ అత్యంత పని నైపుణ్యాన్ని ప్రదర్శిస్తే ఆదర్శప్రాయుడు కాడు కదా.. కత్తిని ఉపయోగించుకోవాలి అంటే దానిని పట్టుకునే విధానం తెలియాలి. కత్తి అంచును పట్టుకుంటే గాయపరుస్తుంది.. పిడిని పట్టుకుంటే విజయాన్ని ప్రసాదిస్తుంది. శత్రువు బలవంతుడైనా, బలహీను డైనా వాడుకోవడం తెలిసిన నాయకుడు విజేతగా నిలుస్తాడు.

 పాలకుర్తి రామమూర్తి