04-09-2025 12:00:00 AM
-జిల్లాలో పార్టీ శ్రేణులతో ఆమెకు సంబంధాలు అంతంత మాత్రమే..
-తాజా పరిణామాలపై జిల్లాలో జోరుగా చర్చ
-సస్పెన్షన్‌పై స్పందించిన ఎమ్మెల్యేలు
మేడ్చల్, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి) : బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవితపై అధిష్టానం సస్పెండ్ చేయడంతో చర్చనీయాంశమైంది. జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణుల్లో ఎక్కడ చూసినా ఇదే చర్చ జరుగుతోంది. తాజాగా ఆమె ఎమ్మెల్సీ పదవికి, పా ర్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశా రు. దీంతో ఆమె సొంతంగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మేడ్చల్ జిల్లాలో ఐదు నియోజకవర్గాలలో పార్టీ క్యాడర్‌తో కవితకు సంబంధాలు పెద్దగా లేవు. తెలంగాణ జాగృతిలో చురుగ్గా పనిచేస్తున్న వారు కూడా లేరు.
బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కవిత హవా కొనసాగినప్పటికీ జిల్లాలో పదవులు ఆశించిన వారు, ద్వితీయ శ్రేణి నాయకులు కూడా సంబంధాలు పెట్టుకోలేదు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ అధికారంలో లేకున్నప్పటికీ క్యాడర్ మాత్రం చెక్కుచెదరలేదు. పార్టీ కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరవుతున్నారు. జిల్లాలో ఐదు నియోజకవర్గాల్లోనూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఉండడం వల్ల క్యాడర్ అలాగే ఉంది.
కాంగ్రెస్ అధికారంలో కి వచ్చిన తర్వాత వివిధ కారణాలవల్ల మున్సిపల్ చైర్మన్లు, కౌన్సి లర్లు, కార్పొరేటర్లు బి.ఆర్.ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం వల్ల ఆ పా ర్టీలో చేరారని, కవిత వెంట నడవడానికి రాజకీ య భవిష్యత్తు కనిపించడం లే దని ఒక నాయకుడు అభిప్రాయపడ్డారు. ప్రతి రాజకీయ నాయకుడు రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసు కుంటారని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాములో నిరాదరణకు గురైన వారు, వివిధ పార్టీలలో అసంతృప్తితో ఉండి ఒక వేదిక కోసం ఎదురుచూస్తున్న వారు కవితతో నడిచే అవకాశం ఉందని మరో నాయకుడు అభిప్రాయపడ్డారు.
అధికారంలో ఉన్న సమయంలో అధిక ప్రాధాన్యం..
బీఆర్‌ఏస్ అధికారంలో ఉన్న సమయంలో కవితకు జిల్లాకు చెందిన నాయకులు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అప్పటి మంత్రి మల్లారెడ్డి, మైనంపల్లి హను మంతరావు, ఇతర ఎమ్మెల్యే లు టచ్‌లో ఉండేవారు. ఆయా నియోజకవ ర్గాలలో వివిధ కార్యక్రమాలకు కవితను ఆహ్వానించేవారు. ఆమె రాక కోసం గంటల తరబడి నిరీక్షించేవారు. జైలు నుంచి విడుదలైన తర్వాత నిజామాబాద్ వెళ్తున్నప్పుడు మేడ్చల్లో పెద్ద ఎత్తున స్వాగతం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కెసిఆర్ కు లేఖ రాసిన తర్వాత కవిత జిల్లాకు వచ్చారు. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఒక దేవాలయంలో పూజలు చేశారు. కవితతో పాటు మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా హాజరు కావడం, పులి బిడ్డ అని మాట్లాడడం అప్పట్లో చర్చనీయాంశమైంది.
స్పందించిన ఎమ్మెల్యేలు..
కవిత సస్పెన్షన్‌పై నాయకులు ఆచితూచి స్పందిస్తున్నారు. కవితను సస్పెండ్ మా త్రమే చేశారు. బహిష్కరించలేదు. మళ్లీ పార్టీలోకి తీసుకుంటే తాము టార్గెట్ అవు తామన్న ఉద్దేశంతో ఎక్కువ మాట్లాడడం లేదు. సస్పెన్షన్ పై జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు స్పందించారు. సింగపూర్ పర్యటన ముగిం చుకొని వచ్చిన తర్వాత మాజీ మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కవిత సస్పెన్షన్ సరైన నిర్ణయం అన్నారు. కూకట్పల్లి, కుతుబుల్లాపూర్ ఎమ్మెల్యేలు మాధ వరం కృష్ణారావు, వివేక్ గౌడ్ కూడా సస్పెన్షన్ సరైన నిర్ణయం అన్నారు.