09-09-2025 08:34:40 PM
భద్రాచలం (విజయక్రాంతి): నవ సమాజ నిర్మాణానికి కవిగా తెలంగాణ ప్రజలకు తెలంగాణ భాష యాషను రాబోయే తరానికి తెలియజేస్తూ బ్రిటిష్ వారితో ప్రజలకు జరుగుతున్న సమస్యలను తన కలం ద్వారా ప్రజల యొక్క జీవన విధానాలను తెలియపరిచి ప్రజాకవిగా పేరుగాంచిన మహోన్నత వ్యక్తి కాళోజి నారాయణరావు అని ఐటిడిఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్(ITDA Assistance Project Officer General David Raj) అన్నారు.
మంగళవారం ఐటిడిఏ కార్యాలయంలోని సమావేశం మందిరంలో ప్రజాకవి కాలోజి నారాయణరావు 111వ జయంతిని పురస్కరించుకొని యూనిట్ అధికారులు, సిబ్బంది సమక్షంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, తెలంగాణ జీవిత చలనశీలి, పుట్టుక చావులే కాకుండా బతుకంతా తెలంగాణ కొరకు పాటుపడిన మహనీయుడు కాళోజీ నారాయణరావు అని, నిజాం ధమననీతికి నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా అతను తన కలమును ఎత్తాడని, అతను స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు అని, తెలంగాణ తొలి పొద్దు కాళోజీ అని, అన్యాయాన్ని ఎదిరిస్తే నా గొడవకు సంతృప్తి అన్యాయం అంతరిస్తే గొడవకు ముక్తి ప్రాప్తి అని, అన్యాయాన్ని ఎదిరించిన వాడే నాకు ఆరాధ్యుడు అని సగర్వంగా ప్రకటించి, ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాలోజి నారాయణరావు అన్నారు. ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా బతకాలని చాటిన మానవతావాది ఆయనని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తన వంతు కృషి చేశారన్నారు. ఇలాంటి గొప్ప వ్యక్తుల ఆశయాల సాధనకు గిరిజనుల సంక్షేమం కొరకు పనిచేస్తున్న మనం ఆయనను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కంకణ బద్దులు అయ్యి గిరిజనులకు మరింత సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణమ్మ, ఏవో సున్నం రాంబాబు, ఏడిఎంహెచ్ఓ సైదులు, జేడీఎం హరికృష్ణ, మేనేజర్ ఆదినారాయణ, మరియు ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.