09-09-2025 08:48:25 PM
జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్..
గద్వాల (విజయక్రాంతి): విద్యార్థులకు మెరుగైన విద్య, నాణ్యమైన భోజనం, అన్ని సౌకర్యాలు అందించాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్(District Collector B.M. Santosh) అధికారులను ఆదేశించారు. బుధవారం మల్దకల్ మండలంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం, జూనియర్ కళాశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని తరగతి గదులు, వంటగది, భోజనం నాణ్యత, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులకు మెరుగైన విద్య అందించడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి విద్యార్థి 100 శాతం హాజరు ఉండేలా చూడాలని అన్నారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేందుకు మెనూ ప్రకారం ప్రతి రోజు పౌష్టికాహారం ఇవ్వాలని, ఆహార పదార్థాలు నాణ్యంగా ఉండేలా చూడాలన్నారు. వంట కోసం తాజా కూరగాయలు, నాణ్యత గల సరుకులు మాత్రమే వినియోగించాలన్నారు. వంటశాల ప్రదేశం, వంట పాత్రలు ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూడాలని సూచించారు.
విద్యార్థుల హాజరును సాంకేతికంగా పర్యవేక్షించేందుకు ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థను నిత్యం వినియోగించాలని అన్నారు. పాఠశాల పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని అన్నారు.స్పెషల్ ఆఫీసర్ ప్రతి 15 రోజులకు పాఠశాల నిర్వహణ తనిఖీ చేసి రిమార్కులు అందిస్తున్నారని అధికారులు కలెక్టర్ కు తెలిపారు. 10వ తరగతి చదువుతున్న అనాధ విద్యార్థినితో ప్రత్యేకంగా మాట్లాడి, హాస్టల్‌లో అన్ని వసతులు, సౌకర్యాలు అందిస్తున్నట్లు పేర్కొని, కష్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ విజయ లక్ష్మి, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.