26-01-2026 02:02:10 AM
హైదరాబాద్, జనవరి 25 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వానికి దొడ్డు బియ్యాన్ని వేలం వేయడం సవాల్‌గా మారింది. గోదాములు, రేషన్ షాపుల వద్ద నిల్వ ఉన్న దొడ్డు బియ్యం విక్రయానికి సివిల్ సప్లయ్ శాఖ టెం డర్ పిలిచినా.. ఒక్క కంపెనీ కూడా ముందుకు రావడం లేదు. వేలం వేయడం ఆలస్యమైన కొద్దీ నష్టం కూడా పెరుగుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో దొడ్డు బియ్యం విక్రయానికి మరోసారి టెండర్‌ను ఆహ్వానించి.. త్వరగా విక్రయించాలని సంబంధిత శాఖ అధికారులు ఆలోచన చేస్తున్నారు.
రెండోసారి ఆహ్వానించే టెండర్‌లో.. కిలో బియ్యం ధరను కొంత తగ్గించాలనే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం. సర్కార్ నుంచి అనుమతి రాగా నే.. టెండర్ ఆహ్వానించాలనే యోచనలో ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. గతేడాది ఏప్రిల్‌లో ఉగాది నుంచి రాష్ట ప్రభుత్వం రేషన్‌షాపుల ద్వారా తెల్ల రేషన్ కార్డులున్న వినియోగదారులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అప్పటివరకు రాష్ట్రలో 1.40 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం మిగిలింది.
ఈ బియ్యం విలువ సుమారుగా రూ. 500 కోట్ల వరకు ఉంటుందని సివిల్ సప్లయ్ శాఖ అంచనా వేసింది. మిగిలిపోయిన ఈ దొడ్డు బియ్యం టెండర్ ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే గత నెలలోనే పేరుకుపోయిన దొడ్డు బియ్యానికి సివిల్ సప్లయ్ శాఖ టెండర్‌ను ఆహ్వానించినా.. ఒక్క టెండర్ కూడా రాలేదు. దీంతో దొడ్డుబియ్యం కొనుగోలు కోసం టెండర్లు వస్తే గత మంగళవారమే తెరవాలి. కానీ ఒక్క టెండర్ కూడా రాకపోవడంతో.. మరోసారి టెండర్లను ఆహ్వానానికి కసరత్తు చేస్తున్నారు.
చిన్న బిడ్డర్లకు అవకాశం..
అయితే దొడ్డు బియ్యం కొనుగోలుకు మొదటిసారి బిడ్డర్లు ముందుకు రాకపోవడానికి ప్రధాణ కారణం మొత్తం నిల్వగా ఉన్న 1.40 లక్షల టన్నులను ఒకే లాట్ కింద పెట్టడమే ఇబ్బందికరంగా మారిందనే విమర్శలు ఉన్నాయి. ఈ టెండర్‌క్ పెద్ద బిడ్డర్లు రాకపోవడం, చిన్నబిడ్డర్లు పాల్గొనే అవకాశం లేక పోవడం ప్రధాన కారణమని చెబుతున్నారు. కనీసం చిన్న లాట్లుగా ఏర్పాటుచేసి టెండర్ ఆహ్వానిస్తే ఎక్కువ సంఖ్యలో బిడ్డర్లు పాల్గొనే అవకాశం ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అంతేకాకుండా వేలం వేయా లనుకున్న బియ్యం ధరను కిలో రూ.24గా సివిల్ సప్లయ్ శాఖ ముందే నిర్ణయించడం కూడా బిడ్డర్లు ముందుకు రాకపోవడానికి ప్రధాణకారణమని చర్చ ఉంది. వేలం వేయాలనుకుంటున్న దొడ్డురకం బియ్యం అప్పటికే పాతపడటం, సగానికిపైగా పురుగులు పట్టి నాణ్యత లోపించి ఉండటంతో ఆ ధర మరీ ఎక్కువ అని బిడ్డర్లు అభిప్రాయపడినట్టు తెలిసింది. ఇది సివిల్ సప్లయ్ శాఖ అధికారుల నిర్లక్ష్యం, ముందుచూపులేని వి ధానంతోనే సర్కార్‌కు ఆర్థికంగా తీవ్రనష్టం చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండోసారి ఆహ్వానించే టెండర్లలో మార్పు లు చేయనున్నట్లు సమాచారం.
అధికారుల నిర్లక్ష్యం వల్లే..
ఇదిలా ఉంటే ఏప్రిల్ నుంచి రేషన్ కార్డు దారులకు ప్రభుత్వం సన్న బియ్యం పంపిణి చేస్తుందని తెలిసినా.. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయికి దొడ్డుబియ్యాన్ని సరఫరా చేశారు. ప్రభుత్వం ముందుగా ప్రకటించిన తేదీ మేరకు ఏప్రిల్ నెలలోనే ఉగాది పండుగ రోజునే సన్న బియ్యం పంపిణీ ప్రారంభించడంతో.. గోదాముల్లో 1.4 లక్షల టన్నుల బియ్యం, రేషన్‌షాపు డీలర్ల వద్ద 40 వేల మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలుగా పేరుకుపోయినాయి.
రేషన్‌షాపుల్లోని బియ్యం పందికొక్కులు బుక్కి, ముక్కిపోయి పాడైపోతు న్నాయని, వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలని డీలర్లు అధికారులు ఇప్పటికే అనేకసార్లు ఫిర్యాదులు చేశారు. అధికారుల ఉదాసీనత వల్లే 10 నెలలుగా రూ.500 కోట్ల విలువైన బియ్యం అటు రేషన్‌దుకాణాలు, ఇటు గోదాముల్లో మూలుగుతున్నట్లుగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
దొడ్డుబియ్యాన్ని వేలం వేయాలని సెప్టెంబర్ 9న అప్పటి సివిల్ సప్లయ్ శాఖ కమిషనర్ చౌహాన్ ఉత్తర్వులు జారీచేసినా టెండర్ పట్టాలెక్కడానికి 4నెలలు పట్టడం గమనార్హం. అధికారులు ముందుగా స్టాక్ నిలిపేసినా, లేదంటే స్టాక్‌ను వెంటనే వేలంలో అమ్మినా సివిల్ సప్లయ్‌కు భారీనష్టం తప్పేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.