26-01-2026 01:49:27 AM
ముందస్తు మొక్కులకు తరలివచ్చిన భక్తులు
మేడారం, జనవరి 25 (విజయక్రాంతి): ముందస్తు మొక్కులు చెల్లించేందుకు ఆదివారం భక్తులు లక్షల్లో మేడారం తరలివచ్చారు. దీంతో మేడారం పరిసరాల్లో ఎక్కడ చూసినా భక్తులతో నిండి భక్తజన మేడారంగా మారింది. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకున్నారు. వరస సెలవులతో పాటు రథసప్తమి పండగ ను పురస్కరించుకొని భక్తులు ముందుగా మేడారం జాతరకు తరలి రావడంతో మేడారం వైపే వేలాది వాహనాలు దారితీసాయి. హనుమకొండ నుంచి మొదలుకొని మేడారం వరకు రహదారులు వాహనాలతో కిక్కిరిసిపోయాయి.
ఇటు పసర నుంచి మేడారం వరకు పలుమార్లు ట్రాఫిక్ జామ్ అయింది. అటు తాడ్వాయి మేడారం రహదారిలో వాహనాల రద్దీ పెరగడంతో వీఐపీ పార్కింగ్ లోకి వాహనాలను మళ్లించారు. జాతరలో భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో పోలీసులు క్యూ లైన్ ల ద్వారా గద్దెల ప్రాంగణంలోకి భక్తులను అనుమతించారు. అలాగే భక్తులు గద్దెల ప్రాంగణంలోకి అనుమతించకుండా గ్రిల్ బయట నుండి దర్శనం చేసుకునే విధంగా చర్యలు చేపట్టారు. భక్తులు కొబ్బరికాయలు, బంగారం (బెల్లం) దిమ్మెలను గద్దెల పైకి విసరడంతో ఆదివారం కూడా పలువురు భక్తులు గాయపడ్డారు.
భక్తులారా మీ తలలు జాగ్రత్త!
వీలైతే హెల్మెట్ ధరించండి
మేడారం జాతరకు వెళ్తున్న భక్తులారా కాస్త మీ తలలు జాగ్రత్తగా కాపాడుకోండి.. వీలైతే హెల్మెట్ ధరించి దర్శనానికి వెళ్లడం మంచిదంటూ సూచిస్తున్నారు. సమ్మక్క సారలమ్మ జాతర గద్దెలపైకి భక్తులు కొబ్బరికాయలు, బంగారం (బెల్లం) దిమ్మెలు విసురుతుండడంతో గద్దెల పైన ఉన్న భక్తుల తలలు పగులుతున్నాయి. గత కొద్దిరోజుల నుంచి గద్దెల పైన ఇటువంటి సంఘటనలు తరచుగా జరగడంతో పాటు భక్తుల రద్దీ ఎక్కువైన రోజు గాయపడే భక్తుల సంఖ్య కూడా అదే తరహాలో పెరుగుతోంది.
ఆదివారం కూడా పెద్ద ఎత్తున భక్తులు మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి ముందస్తు మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చారు.దీంతో గద్దెల పైకి భక్తులను అనుమతించకపోవడంతో గ్రిల్ బయట నుండి కొబ్బరికాయలు, బంగారం (బెల్లం) దిమ్మెలు విసురుతున్నారు. దీనితో నిజామాబాద్ కు చెందిన స్వప్న, ఖమ్మంకు చెందిన గోపి తో పాటు మరికొందరి తలలకు గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు.
గద్దెల పైకి వెళ్లే భక్తులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలంటూ అనౌన్స్‌మెంట్ చేస్తున్నారు. గద్దెల పైన పూజారులు, వాలంటీర్లు, పోలీసులు హెల్మెట్ ధరించి విధులు నిర్వహిస్తున్నారు. అలాగే ప్రత్యేకంగా వచ్చే వీఐపీలు, ఇతర భక్తులకు హెల్మెట్ ధరించిన తర్వాతే గద్దెల పైకి అనుమతిస్తున్నారు. ఇదిలా ఉంటే మేడారం వచ్చే భక్తులు ముందస్తు జాగ్రత్తగా ముఖానికి మాస్క్, తలకు శిరస్త్రాణం (హెల్మెట్) ధరించి మేడారం వెళ్లడం మంచిదని సూచిస్తున్నారు.