26-01-2026 01:59:50 AM
హైదరాబాద్, జనవరి 25 (విజయక్రాంతి) : ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ చూసినా కుంభకోణాలు, విచారణల అంశంపైనే ప్రధానంగా చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక విచారణలను చేపట్టింది. గత పదేళ్ల బీఆర్‌ఎస్ హయాంలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ మాజీ సీఎం కేసీఆర్, హరీశ్‌రావు, కేటీఆర్‌లను విచారించింది. తాజాగా సింగరేణి కుంభకోణం ఆరోపణలు ఒకవైపు, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసులు, విచారణ మరోవైపు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం పాలన కంటే ఆరోపణలు, -విచారణల చుట్టే తిరుగుతున్నాయనే విమర్శలతో రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతున్నది. అధికార పార్టీ, ప్రతిపక్షం మధ్య సాగుతున్న రాజకీయ యుద్ధంలో రోజుకొక కొత్త స్కామ్, కొత్త విచారణ అంశంగా మారుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు, ప్రాజెక్టుల అవకతవకల ఆరోపణలు, గత ప్రభుత్వ నిర్ణయాలపై విచారణలు.. ప్రతీ అంశం రాజకీయ లాభనష్టాల కోణంలోనే చర్చకు వస్తోంది.
అధికార వర్గాలు ‘చట్టం ప్రకారం పనిచేస్తున్నామని’ చెబుతుంటే, ప్రతిపక్షం మాత్రం ‘ఇది కక్షపూరిత రాజకీయాలు, ప్రజల దష్టిని మళ్లించే యత్నం’ అంటూ ఆరోపిస్తోంది. ఈ పరిస్థితి వల్ల రాజకీయ చర్చల అజెండా మొత్తం కేసులు-, -నోటీసులు, విచారణలకే పరిమితం అవుతోందన్న విమర్శలు పెరుగుతున్నాయి.
శాసనసభ సమావేశాలు కూడా ప్రజా సమస్యలపై చర్చకు వేదిక కావడం లేదన్న భావన రాజకీయ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది. కానీ ఈ పరిస్థితుల్లో ప్రజల నిత్యజీవితాన్ని ప్రభావితం చేసే సంక్షేమం, అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం అంశాలు చర్చకు దూరమవుతున్నాయన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.
పాలనలో ఫోకస్ కూడా అవసరమే...
రాజకీయ వేడి పెరిగిన కొద్దీ, పాలనపై ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందన్న అభిప్రాయం ఉంది. రైతులకు అందాల్సిన మద్దతు ధరలు, ఇన్‌పుట్ సబ్సిడీలు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, పట్టణ-గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అధికార యంత్రాంగం కూడా రాజకీయ ఒత్తిళ్ల మధ్య పనిచేస్తోందన్న విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయని చెబుతున్నప్పటికీ, నిధుల కొరత, చెల్లింపుల ఆలస్యం, అర్హుల గుర్తింపులో లోపాలు వంటివి సమస్యలుగా మారుతున్నాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అభివృద్ధి విషయంలో అయితే కొత్త ప్రాజెక్టులు, పెట్టుబడుల ఆకర్షణపై స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఆయా రంగాల్లో దీర్ఘకాలిక ప్రణాళిక కనిపించడం లేదన్న విమర్శలు రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్నాయి.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రాజకీయ వాదనలకు అతీతంగా పెద్ద సవాలుగా మారింది. అప్పులు పెరుగుతున్నాయన్న అంచనాలు, ఆదాయం, వ్యయం మధ్య పెరుగుతున్న లోటు, పన్నులు, చార్జీల పెంపు వంటివి సామాన్య ప్రజలపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతున్న అంశాలుగా మారాయి. విద్యుత్ చార్జీలు, రవాణా ఖర్చులు, రోజువారీ అవసరాల ధరలు పెరగడంతో ప్రజల జీవన వ్యయం భారీగా పెరిగిందన్న వాదన కూడా ఉంది.
డైవర్షన్ పాలిటిక్స్ అనే ఆరోపణలు..
ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ కేసులు, విచారణలపై తీవ్రంగా మండిపడుతోంది. ‘ఆర్థిక ఇబ్బందులు, హామీల అమలులో వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం విచారణల పేరిట రాజకీయాలు’ చేస్తోందని ఆరోపిస్తుంది. అయితే ప్రతిపక్ష పార్టీ వాదనను అధికార పార్టీ ఖండిస్తుంది. ‘అక్రమాలపై చర్యలు తీసుకోకపోతే ప్రజలకే అన్యాయం’ అని వాదిస్తోంది. ఈ రెండు వాదనల మధ్య సామాన్య ప్రజలు నష్టపోతున్నారన్న భావన బలపడుతోంది.
ప్రజలు కోరుకుంటున్నవి ప్రజలకు సమకూరుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ప్రజలు పాలనలో స్థిరత్వం, సంక్షేమ పథకాల సక్రమంగా అమలు కావడం, అభివృద్ధికి స్పష్టమైన దిశ, ఆర్థిక భారాన్ని తగ్గించే విధానాలను కోరుకుంటున్నారు. కానీ రాజకీయాలు స్కాములు-, -విచారణల చుట్టే తిరుగుతుంటే ఈ లక్ష్యాలు ఎంతవరకు నెరవేరతాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రజల జీవితాలను మెరుగుపరిచే నిర్ణయాలపై దృష్టి పెట్టడం సర్కార్‌కు పెద్ద సవాల్‌గా మారుతుంది. విచారణల రాజకీయాలు తాత్కాలిక లాభం ఇచ్చినా, దీర్ఘకాలంలో పాలన, అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.