30-07-2025 01:30:31 AM
హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): ఇంజినీరింగ్ సహా ఇతర ప్రైవేట్ ప్రొఫెషనల్ కోర్సులు అందించే కాలేజీల యాజమాన్యాలతో తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి నేతృత్వంలోని ఫీజుల ఖరారు ఉన్నతస్థాయి కమిటీ తొలి సమావేశం మంగళవారం జేఎన్టీయూలో జరిగింది. ఈ సమావేశానికి దాదాపు పన్నెండు పేరుగాంచిన కాలేజీల యాజమాన్యాలు హాజరైనట్లు తెలిసింది.
ఆయా కాలేజీల యాజమాన్యాలకు ఈ కమిటీ పలు ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. 2025 నుంచి 2027 విద్యాసంవత్సరం వరకు మూడేళ్లు ఫీజులను ఎందు కు పెంచాలి? భారీ స్థాయిలో ఫీజులను ఎందుకు ప్రతిపాదించారో చెప్పాలని కోరింది. దీనిపై కాలేజీలు వివరణ ఇస్తూ.. మూడేళ్లకోసారి ఫీజులను పెంచే నిబంధనలున్నాయని పేర్కొన్నాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా ఫీజులను పెంచాల్సి వచ్చిందని కాలేజీలు చెప్పినట్లు ఓ అధికారి తెలిపారు.
రాష్ట్రంలోని డీమ్డ్ యూనివర్సిటీలతో ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు పోటీ తట్టుకోవాలంటే మంచి ఫ్యాకల్టీతోపాటు విద్యార్థులకు వసతులను కల్పించాల్సి ఉంటుందని, ఈనేపథ్యం లోనే ఫీజులను పెంచాలని కోరుతున్నట్లు ఆయా కాలేజీలు కమిటీకి వివరించినట్లు తెలిసింది. అసలు ఫీజులు ఎందుకు పెంచకూడ దో కమిటీని పలు కాలేజీలు ప్రశ్నించినట్లు తెలిసింది.
మరోసారి కాలేజీల ఆడిట్ రిపోర్టులు పరిశీలన..
టీఏఎఫ్‌ఆర్‌సీకు రాష్ట్రంలోని ప్రొఫెషనల్ కాలేజీలు సమర్పించిన ఆడిట్ రిపోర్టులను కమిటీ మరోసారి పరిశీలించనుంది. తొమ్మి ది మందితో కూడిన ఈ కమిటీలో ఒక్కో విభాగానికి చెందిన ఒక్కో ఉన్నతాధికారి ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరు ఒక్కో అంశాన్ని పరిశీలించనున్నారు. చైర్మన్‌గా ఉన్న ప్రొ.బాలకిష్టారెడ్డి న్యాయపరమైన అంశాలను చూసు కుంటే, కాలేజీల అనుమతులు చూసుకునేది డీటీసీపీ అధికారి, ఫ్యాకల్టీ అర్హతలు, వారి జీతాలు, కాలేజీలు సమర్పించిన రిపోర్టులను ఇతర అధికారులు క్రాస్‌చెక్ చేయనున్నారు.
ఇందుకు సబ్ కమిటీలను సైతం వేయనున్నారు. కాలేజీలు, విద్యార్థులు, తల్లిదండ్రుల తో చర్చించి ఓ నివేదికను ఈ కమిటీ రూపొందించనుంది. ఫీజులు ఎంతమేర పెంచాలి? అసలు పెంచాలా? వద్దా? అనే అంశాలపై కమిటీ పరిశీలించనుంది. ఏపీ, కర్ణాటక, గుజరాత్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లోని ఫీజులపై కూడా అధ్యయనం చేసి ప్రభుత్వంపై పెద్దగా భారం పడకుండా ఉండేలా ఫీజులపై రాష్ట్ర ప్రభుత్వానికి తుది నివేదిక అందజేయనుంది. అయితే మరోసారి కాలేజీల యాజమాన్యలతో ఈ కమిటీ భేటీ కానున్నది.