calender_icon.png 10 January, 2026 | 12:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వివాదాలెందుకు?

10-01-2026 01:14:56 AM

కృష్ణా ప్రాజెక్టులకు అడ్డంకులు వద్దు

  1. మాకు లొల్లి వద్దు.. నీళ్లు కావాలి
  2. రాజకీయాలకు అతీతంగా పరిష్కరించుకుందాం
  3. ఏపీ సీఎం చంద్రబాబుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి

రంగారెడ్డి, జనవరి 9 (విజయక్రాంతి) : ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణా నది పై ఉన్న ప్రాజెక్టుల అనుమతులకు అడ్డంకులు పెట్టవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీఎం రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. జల వివాదాల విషయంలో రాజకీయ ప్రయోజనం పొందాలని తమ ప్రభుత్వం ప్రయత్నించడం లేదని ఆయన అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల ఈ--సిటీ లో ‘సుజెన్ మెడికేర్’ ఐవీ ఫ్లూయిడ్స్ తయారీ యూనిట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడారు.. ‘పంచాయితీ కావాలా.. నీళ్లు కావాలా అని నన్ను అడిగితే తెలంగాణకు నీళ్లే కావాలని చెబుతా. వివాదాలు కావాలా.. పరిష్కారం కావాలా.. అని అడిగితే పరిష్కారం కావాలని చెబుతా. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను మనమే పరిష్కరించుకుందాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఓ విజ్ఞప్తి చేస్తున్నా. కృష్ణా నదిపై ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టుల అనుమతులకు అడ్డంకులు పెట్టకండి. ఇలా అడ్డంకులతో బ్యాంకుల నుంచి, కేంద్రం నుంచి నిధులు రావడం లేదు.

రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతున్నది. మేం వివాదాలు కోరుకోవడం లేదు. పరిష్కారమే మార్గం. తెలంగాణకు పోర్టు కనెక్టివిటీ రావాలంటే పక్క రాష్ట్రం సహకారం ఉండాలి. పొరుగు రాష్ట్రం ఏదైనా సరే, మేం వివాదాలు కోరుకోవడం లేదు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం ఒక్క అడుగు ముందుకు వేస్తే, తెలంగాణ పది అడుగులు ముందుకు వేస్తుంది అని రేవంత్‌రెడ్డి చెప్పారు. సమస్యలకు పరిష్కారం చర్చలేనని, వాటిని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందామని అన్నారు.

నల్లమల సాగర్‌కు నీళ్లు తీసుకెళ్తాం

  1. రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం
  2. ఏడు మండలాల విలీనంతోనే పోలవరానికి మార్గం సుగమం
  3. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు

హైదరాబాద్, జనవరి 9 (విజయక్రాంతి) : ఇరు రాష్ట్రాలకు సంబంధించిన నదీ జలాలపై గొడవలతో ఎవరికీ ప్రయోజనం ఉండదని, తనకు గొడవలు వద్దని, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. నదీ జలాల సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుందామని అన్నారు. ఈ నేపథ్యంలో నల్లమల సాగర్ ప్రాజెక్టును పూర్తిచేసి నీళ్లు తీసుకెళ్తామని చెప్పారు. పోలవరం పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామని స్పష్టం చేశారు.

తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చంద్ర బాబు మాట్లాడారు. పట్టిసీమ ద్వారా 100 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించి పంటలను కాపాడటమే కాకుండా, అక్కడ పొదుపు చేసిన నీటిని శ్రీశైలం నుంచి హంద్రీనీవా, గాలేరునగరి వంటి ప్రాజెక్టుల ద్వారా రాయలసీమకు అందించి ‘రాళ్ల సీమ’ను ‘రతనాల సీమ’గా మారుస్తున్నామని చెప్పారు.

సముద్రంలోకి వెళ్లే నీటిలో 300 టీఎంసీలు వాడుకుంటే కరవే ఉండదన్నారు. పోలవరం పూర్తయితే ఈ ప్రాంతానికి నీటి సమస్యే ఉండదని, పోలవరం నుంచి విశాఖకు.. అక్కడి నుంచి వంశధారకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమని తేల్చిచెప్పారు. గొడవలు పెట్టుకుంటే వచ్చే ప్రయోజనాలు ఏమీ ఉండవని, మనవద్ద నీళ్లు మిగిలితే తెలంగాణ కూడా వాడుకోవచ్చన్నారు.

శ్రీశైలంలో నీళ్లు పొదుపుచేసి రాయలసీమకు తరలిస్తామని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై నిబద్ధతను చాటుకున్నానని.. అప్పట్లో తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తేనే తాను ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తానని కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా చెప్పానన్నారు. ఆ మండలాల విలీనం పల్లే నేడు పోలవరం పనులు సుగమమయ్యాయని వెల్లడించారు. ప్రస్తుతం ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు.