calender_icon.png 18 September, 2025 | 9:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మణిపూర్ కథ మారేనా?

16-09-2025 12:00:00 AM

మణిపూర్‌లో కుకీ, మైతీ తెగల మధ్య రెండేళ్లుగా సాగుతున్న ఘర్షణ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం అక్కడ పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు తెగల మధ్య ఘర్షణ కారణంగా అల్లర్లు చెలరేగిన తర్వాత మోదీ మణిపూర్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో మణిపూర్‌లో తిరిగి శాంతిని నెలకొల్పేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని మోదీ చెప్పడం ముదావహం.

కుకీలు ఎక్కువగా ఉండే చురాచంద్‌పూర్, అలాగే మైతీలు ఎక్కువగా ఉండే ఇంఫాల్‌లో నిర్వహించిన బహిరంగ సభల్లో మాట్లాడారు. తొలుత చురాచంద్‌పూర్‌లో 7,300 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, తర్వాత ఇంఫాల్‌లో 1,200 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించారు. ఇంఫాల్, చురాచంద్‌పూర్ సభలు పరిశీలించి చూస్తే.. మ ణిపూర్‌లో శాంతి చేకూరాలన్న మాటలు మోదీ నోట వినిపించాయి.

ని త్యం ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్‌ను మళ్లీ శాంతికి, అభివృద్ధికి చిహ్నంగా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మోదీ స్పష్టం చే శారు. రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనల వల్ల నిరాశ్రయులైన వారిని ఆదుకుంటామని ప్రధాని సభా వేదికగా ప్రకటించారు. రూ. 7వేల కొత్త ఇండ్లను కట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక సాయం అందిస్తున్నట్టు పే ర్కొన్నారు.

అంతేకాదు కేంద్రం ఇటీవలే రూ.3 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీకి ఆమోదం తెలిపిందని.. ఇందులో నిరాశ్రయుల కోసమే ప్రత్యేకంగా 500 కోట్లు కేటాయించామని తెలిపారు. మొత్తంగా చూసుకుంటే మణిపూర్ బాధితులను ఆదుకునేందుకు, శాంతిని నెలకొల్పేందుకు, అభివృద్ధి ప నులు సక్రమంగా జరిగేందుకు కేంద్రం అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తుందని భరోసానివ్వడం కొత్త ఆశలను చిగురించేలా చేస్తోంది.

అయితే మోదీ పర్యటనకు ముందే మణిపూర్‌లో ప్రాదేశిక సమగ్రతకు భంగం వాటిల్లకుండా శాశ్వత శాంతి, స్థిరత్వాన్ని తీసుకురావడానికి చర్చల పరిష్కారం అవసరమని కుకీ తిరుగుబాటు గ్రూపులు, కేంద్ర ప్రభుత్వం భావించాయి. సెప్టెంబర్ 4న ఢిల్లీలో జరిగిన త్రైపాక్షిక సమీక్షా సమావేశంలో మణిపూర్‌లోని కీలకమైన జా తీయ రహదారి తిరిగి తెరిచేందుకు కుకీలు అంగీకరించారు.

రాష్ట్రానికి జీవనాధారామైన ఈ జాతీయ రహదారిని ప్రయాణికులు, సరుకు రవాణా కోసం తెరిచేందుకు కుకీ, జో తెగలు నిర్ణయం తీసుకున్నాయి. మ ణిపూర్‌లోని రెండు డజన్లకు పైగా ఉన్న కుకీ, జో, హ్మార్ తిరుగుబాటు గ్రూపులకు చెందిన రెండు సంయుక్త సంస్థలతో వివాదాస్పదమైన సస్పెన్షన్ ఆఫ్ ఆపరేషన్స్ (ఎస్‌ఎస్‌వో) ఒప్పందాన్ని పునరుద్ధరించడం మ ణిపూర్‌లో శాంతికి ఊతం కల్పించినట్లయింది.

రెండేళ్ల క్రితం మైతీలను ఎస్టీ జాబితాలో చేర్చాలన్న రాష్ట్ర హైకోర్టు ప్రతిపాదనను కుకీలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. ఈ అల్లర్లలో ఇప్పటివరకు 260 మందికి పైగా మరణించగా.. 40 వేల మంది కుకీలు, 20 వేల మంది మైతీలు నిరాశ్రయులయ్యారు.

ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి రాష్ట్రపతి పాలనలో మగ్గుతున్న మణిపూర్‌లో రెండేళ్ల తర్వాత మోదీ పర్యటించడాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. అయితే ప్రధాని తాజా పర్యటన మాత్రం మణిపూర్ మార్పుకు ఒక ఆశాకిరణంలా కనిపిస్తోంది.