calender_icon.png 12 January, 2026 | 6:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్యానికి అడ్డుకట్టేదీ!

04-01-2026 12:00:00 AM

పండుగలు, శుభకార్యాలు, చావులు.. ఇలా సందర్భం ఏదైనా సరే తాగుడు మాత్రం పక్కా అనే ధోరణి ఇటీవలే చాలా పెరిగిపోయింది. ఒక్కరోజు మద్యం తాగకపోయినా ఏదో పెద్ద పాపం, నేరం చేసిన ట్లుగా ఫీలయ్యే మందుబాబులు చాలా మందే ఉంటారు. మాములు రోజుల్లోనే మందుబాబులను తట్టుకోవడం కష్టం. ఇక పండుగలు, ఎన్నికల సీజన్ వచ్చినప్పుడు మద్యం ఏరులై పారడం ఖాయం. తాజాగా కొత్త సంవత్సరం వేడుకలను పురస్కరించుకొని  పీకలదాకా మద్యం తాగి వారి ఆరో గ్యాలను పాడు చేసుకుంటూనే, మరోపక్క రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాలకు మాత్రం దండిగా ఆదాయం సమకూర్చిపెట్టడంలో విజయవంతమయ్యా రు.

మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే ప్రకటనలు కేవలం పేపర్లకు, గోడలకు మాత్రమే పరిమితం చేస్తూ విచ్చలవిడి మద్యం అమ్మకాలను ప్రభుత్వాలే దగ్గరుండి ప్రోత్సహిస్తున్నాయి. ప్రపంచంలో మద్యం అమ్మకా లు ఎక్కువగా జరుగుతున్న దేశాల జాబితాలో భారత్ ప్రస్తుతం ఆరో స్థానంలో ఉంది. మద్యం తాగే వారిలో యువతే ఎక్కువగా ఉండడం ప్రధా న కారణం. 2027 నాటికి భారత్‌లో మద్యం అమ్మకాల విలువ దాదాపు 55 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

భారత్‌లో రాష్ట్రాల వారీగా (2024-25 ఏడాదిలో) మద్యం అమ్మకాల్లో మన తెలంగాణ మూడో స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాల్లో కర్ణాటక, తమిళనాడు ఉన్నాయి. 2024--25 ఆర్థిక సంవత్సరం చూసుకుంటే తెలంగాణలో మద్యం మార్కెట్ గణనీయమైన అమ్మకాలను చూసింది. రాష్ట్రంలో ఆదాయం సుమారు రూ. 34,600- కోట్ల నుంచి రూ.36 వేల కోట్ల మధ్య ఉంటుందని ఎక్సైజ్ శాఖ అంచనా వేసింది.

ఇటీవల జరిగిన న్యూ ఇయర్ వేడుకల పేరిట తెలంగాణలో డిసెంబర్ 28 నుంచి 31 అర్థరాత్రి వరకు సుమారు రూ.1,230 కోట్ల లిక్కర్ తాగినట్లు ఎక్సైజ్ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అయితే ఒక్క డిసెంబర్ నెలలోనే మందుబాబులు దాదాపు 5 వేల కోట్ల రూపాయల మద్యం తాగడం గమనార్హం.  దీని కి ప్రధాన కారణం డిసెంబర్ నెలలో సర్పంచ్ ఎన్నికలు జరగడమే. రాజకీ య వేడికి మందు కిక్కు కూడా తోడవ్వడంతో తెలంగాణలోని గ్రేటర్ మిన హా అన్ని జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో వైన్ షాపుల వద్ద పండుగ వాతావరణం కనిపించింది.

దీనికి తోడు రాష్ట్రంలో కొత్త మద్య విధానం కూడా డిసెంబర్‌లోనే అమల్లోకి రావడం కూడా రికార్డు స్థాయి మద్యం అమ్మకాలకు ముఖ్య కారణంగా నిలిచింది. ప్రభుత్వాలు కూడా మద్యం తాగడం తప్పు అని నీతి వ్యాఖ్యలు చెబుతూనే మరోపక్క తాగుడును ప్రోత్సహిస్తూనే వస్తున్నాయి. పండుగలు, న్యూ ఇయర్ లాంటి వేడుకలు వచ్చినప్పుడు మద్యాన్ని అరికట్టాల్సింది పోయి వైన్ షాపులను, బార్లను అర్థరాత్రిళ్ల వరకు తెరుచుకునేందుకు ప్రత్యేక అనుమతులు ఇవ్వడం చూస్తూనే ఉంటాం.

ఒకవైపు తాగుడు తప్పు అని చెబుతూనే దానిని ప్రోత్సహించడం ఒక ఎత్తయి తే.. మరోవైపు ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ పేరిట మందుబాబుల వద్ద నుంచి జరిమానాల రూపంలో వేలకు వేలు దండుకుంటూ రాష్ట్ర ఖజానాను నింపుకో వడం  అదనపు బోనస్‌గా పరిగణించవచ్చు. ఒక్క తెలంగాణ మాత్రమే కాదు అన్ని రాష్ట్రాల్లోనే ఇదే తంతు. తమ ఖజానా నింపుకోవడం కోసం ప్రభుత్వాలు మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తూనే మరోవైపు మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని పేర్కొనే ద్వంద్వ వైఖరిని వీడితే బాగుంటుంది.