calender_icon.png 28 November, 2025 | 1:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోర్టుకు వస్తారా?.. అరెస్టవుతారా?

28-11-2025 12:00:00 AM

  1. బతుకమ్మ కుంట వివాదంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై హైకోర్టు ఆగ్రహం
  2. డిసెంబర్ 5లోగా కోర్టులో హాజరు కావాలని ఆదేశం
  3. రాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇస్తామని హెచ్చరిక 
  4. హైడ్రా తీరుపై అసహనం.. రోజూ 10 పిటిషన్లు వస్తున్నాయని వ్యాఖ్య..

హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 27 (విజయక్రాంతి): హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారంటూ ఆయనపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బతుకమ్మ కుంట భూవివాదం కేసులో కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు గాను.. విచారణకు స్వయంగా హాజరుకావాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్ 5వ తేదీ లోపు రాకపోతే ‘నాన్ బెయిలబుల్ వారెంట్’ జారీ చేయాల్సి వస్తుందని హెచ్చరించింది.

హైదరాబాద్‌లోని బతుకమ్మ కుంట పరిధిలో వివాదం లో ఉన్న ఓ ప్రైవేటు స్థలం విషయంలో హైకోర్టు గతంలో కీలక ఆదేశాలు ఇచ్చింది. ఆ స్థలంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయరాదని, అక్కడ యథాతథస్థితిని కొనసాగించాలని జూన్ 12న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కోర్టు ఆదేశాలను పక్కనబెట్టి హైడ్రా అధికారులు ఆ స్థలంలో మా ర్పులు చేశారంటూ ఎ సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు.. రంగనాథ్ తీరు పై మండిపడింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు మీపై ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. డిసెంబర్ 5న జరిగే విచారణకు హైడ్రా కమిషనర్ స్వయం గా హాజరై వివరణ ఇవ్వాలని, లేనిపక్షంలో అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని తేల్చిచెప్పింది. హైడ్రా పనితీరుపై హైకోర్టు గతంలో నూ పలుమార్లు అసహనం వ్యక్తం చేసిన విషయాన్ని ధర్మాసనం గుర్తు చేసింది.

తుమ్మిడికుంట పునరుద్ధరణ విషయంలోనూ హైడ్రా కోర్టు ఆదేశాలను పాటిం చలేదని న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రాకు వ్యతిరేకంగా రోజూ కనీసం 10 పిటిషన్లు దాఖలవుతున్నాయి. ప్రజలకు మంచి జరిగే పనులు చేయాలి తప్ప, చట్టాన్ని అతిక్రమించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కోర్టు చూస్తూ ఊరుకోదు అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది.