calender_icon.png 18 July, 2025 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కమిటీల పేరుతో కాలం వెళ్లదీస్తున్న గెలిచిన సంఘాలు

17-07-2025 12:21:10 AM

మందమర్రి,(విజయక్రాంతి): సింగరేణిలో గెలిచిన సంఘాలు స్ట్రక్చర్ సమావేశాలలో మాట్లాడుతున్నామని చెబుతూ, కాలపరిమితి లేని కమిటీల పేరు చెప్పి, కాలం గడుపుతున్నారే తప్ప సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం లేదని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి విమర్శించారు. బుధవారం ఏరియాలోని కాసీపేట 2 గనిపై యూనియన్ ఆధ్వర్యంలో ద్వార సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గత కొంత కాలంగా సిఐటియు ఆద్వర్యంలో కార్మిక సమస్యలపై కల్పిస్తున్న అవగాహనను గమనించిన గని కార్మికులు యూనియన్ నాయకుడు సురేష్ ఆధ్వర్యంలో యూనియన్ లో  చేరగా వారికి సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి యూనియన్ కండువాలు కప్పి, యూనియన్ లోకి ఆహ్వానించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ, సింగరేణిలో ఇప్పటికే క్యాడర్ స్కీముల కమిటీ పేరుతో ఆరు నెలలు గడిపారని, మారుపేరుల సమస్యపై గుర్తింపు సంఘం ఆధ్వర్యంలో కమిటీ అని చెప్పి ప్రభుత్వం చేతుల్లో ఉందని చేతులెత్తేసారని, ఇక కార్మికులందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సొంతింటి కల కమిటీ ఊసే ఎత్తడం లేదని పైగా యాజమాన్యం ఎంతో ఖర్చు పెట్టి కొత్త క్వార్టర్ లు కడుతున్నామంటే వ్యతిరేకించకుండా, చూస్తూ ఉండిపోవడం ఏ విధంగా సరైనదని, దానికి బదులు ఎవరి క్వార్టర్ వారికే ఇస్తే యాజమాన్యంపై ఎలాంటి భారం పడకుండా సొంతింటి కల నెరవేరుతుందని తెలిపారు. పెర్క్స్ పై ఆదాయపన్ను మాఫీలో అధికారులకు లేని అడ్డంకి కార్మికులకు ఎందుకు వస్తుందో  స్ట్రక్చరల్ సమావేశాల్లో ప్రశ్నించకుండా కాల పరిమితి లేని కమిటీకి ఒప్పుకున్న ఘనత ఏఐటియుసి గుర్తింపు సంఘానికే దక్కుతుందని ఎద్దేవా చేశారు.

ఇప్పటికే లాభాలు ప్రకటించాల్సిన యాజమాన్యం ప్రకటించకుండా ఆలస్యం చేయడం సరికాదని, ఈ నెలలో లాభాలు ప్రకటించి, కార్మికులకు లాభాల వాటా చెల్లించాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో నిర్వహించిన ఎన్నికలకు రెండు సంవత్సరాల కాలపరిమితి గడువు ముగియ వస్తున్నందున వెంటనే గెలిచిన సంఘం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ప్రాతినిధ్య సంఘం పదేపదే వినతి పత్రాలు ఇస్తూ, శాలువాలు, బొకేలకే పరిమితమయ్యారని, మరోవైపు బిజెపి ప్రభుత్వం తెస్తున్న పని గంటల పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమ్మెకు మద్దతు తెలిపిన ఐఎన్టియుసి అసంఘటిత రంగంలో పని గంటల పెంపుకై కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై కనీస వేతనాల చైర్మన్ స్పందించి, తన వైఖరి తెలియజేయాలన్నారు. కార్మిక సమస్యలపై అనునిత్యం అవగాహన కల్పించడానికి తరగతులు నిర్వహిస్తూ, ముందుకు పోతున్నామని, కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో కార్మికులందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. నిజాయితీగా పనిచేసే యూనియన్ లో ఉండి, సమస్యలపై అటు యాజమాన్యం, ప్రభుత్వాలతో పోరాటాలు చేసేలా సన్నద్ధం కావాలని కోరారు.