calender_icon.png 11 October, 2025 | 8:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పటాన్‌చెరులో మహిళ ఘరానా మోసం!

10-10-2025 01:36:45 AM

  1. తక్కువ ధరకు బంగారం, ప్లాట్లు, విల్లాల పేర రూ.20 కోట్లు వసూలు 
  2. డబ్బులు ఇస్తానని చెప్పి మహిళలపై దాడి 
  3. ఏపీకి చెందిన ఎమ్మెల్యే మనిషినంటూ ప్రచారం 

పటాన్‌చెరు, అక్టోబర్ 9 : ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పేరు చెప్పుకొని ఓ మహిళ సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో చేసిన ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. పటాన్‌చెరు ఏపీఆర్ గ్రాండియాలో నివాసం ఉంటున్న విద్య తక్కువ ధరకు బంగారం, విల్లాలు, ప్లాట్లు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి పలువురు మహిళల వద్ద బంగారం, సుమారు రూ. 18 నుంచి 20 కోట్ల వరకు వసూలు చేసింది.

దీంతో బాధితులు పటాన్‌చెరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  తనకు చెందిన పెద్ద మనుషుల నుంచి రూ.2వేల కోట్లు వస్తున్నాయని కంటైనర్లు కొనడానికి డబ్బులు కావాలని కూడా వసూలు చేసినట్లు బాధితులు చెప్పారు.  గతంలో విద్య సికింద్రాబాద్ వారాసిగూడలోనూ పలువురి నుంచి డబ్బులు తీసుకొని పటాన్‌చెరుకు మకాం మార్చినట్లు బాధితులు తెలిపారు. మహిళలు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని నిలదీయగా గురువారం ఇంటికి రావాలని చెప్పినట్లు తెలిపారు.

తీరా ఆమె ఇంటికి వెళ్ళిన మహిళలను గదిలో పెట్టి రౌడీలతో దాడి చేయించినట్లు తెలిపారు. ఈ దాడిలో కలమ్మ అనే మహిళకు తీవ్ర గాయాలైనట్లు చెప్పారు. ఈ విషయమై పటాన్‌చెరు సీఐ వినాయకరెడ్డిని వివరణ కోరగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. గతంలో కూడా కలమ్మ అనే మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు.

కాగా మహిళలకు మాయమాటలు చెప్పి కోట్ల రూపాయలు వసూలు చేసిన విద్య అనే మహిళ వెనుక ఎవరైనా రాజకీయ నేతల హస్తం ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.