17-08-2025 12:31:35 AM
ఆదిలాబాద్, ఆగస్టు 16 (విజయక్రాంతి): వరుణుడి ప్రతాపానికి ఆదిలాబాద్ నీట మునిగింది. జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాల్లో కురిసిన కుండపోత వానతో పలు కాలనీలు, గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గుడిహత్నూర్ మండలం సీతగొంది గ్రామంలోని ఓ ఇంటిలో గైక్వాడ్ గణేష్ కుటుంబంలోని ఆరుగురు వరదలో చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్ ఘట న స్థలానికి చేరుకున్నారు.
డీడీఆర్‌ఎఫ్ బృం దాలను పిలి పించి వరదల్లో చిక్కుకున్న ఓ చిన్నారితో పాటు ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులను తాడు సహాయంతో రక్షించారు. ఇచ్చోడలోని రెసిడెన్షియల్ పాఠశాల చుట్టూ వరద నీరు వచ్చి చేరింది. పాఠ శాలలో విద్యార్థులు చిక్కుకున్న విషయాన్ని తెలుసుకున్న కలెక్టర్. ఎస్పీ ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఆదిలాబాద్‌లోని కోజా కాలనీకి చెందిన ఓ వ్యక్తి కారులో వెళ్తూ కాలనీ సమీపంలోని వాగు ను దాటే ప్రయత్నం చేయగా.. వరద ఉధృతికి కారు కొట్టుకుపోయింది.
అప్రమత్తమైన ఆయన వెంటనే కారులో నుంచి దిగి ప్రాణాలను రక్షించుకున్నారు. జైనథ్ మండలం తర్ణం వాగులో సైతం 2 లారీలు వరద ఉధృతిలో చిక్కుకుపోయాయి. డ్రైవర్లు క్లీనర్లు సురక్షితంగా బయటపడ్డారు. భారీ వర్షాలకు వందల ఎకరాల పంటలు నీట మునిగాయి. జిల్లాలోని సాత్నాల, మత్తడి వాగు ప్రాజెక్టులకు భారీగా ఇన్‌ఫ్లో పెరగడంతో పూర్తి గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు వదిలారు. కుంటాల, పొచ్చర జలపాతాలు ఉగ్రరూపం దాల్చాయి. వరద ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, అనిల్ యాదవ్, మాజీ మంత్రి జోగు రామన్న పర్యటించారు.
కడెం ప్రాజెక్టు 18 గేట్లు ఎత్తివేత
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాతో పాటు మహారాష్ర్ట సరిహద్దు ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురవడంతో కడెం ప్రాజెక్టులోకి వరద నీరు రికార్డ్ స్థాయిలో వచ్చి చేరుతున్నది. కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టుకు 1,95,923 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా.. మొత్తం 18 గేట్లు ఎత్తి 18,69,75 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు.
ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 700 అడుగులు కాగా 693 అడుగుల సామర్థ్యాన్ని నిలువ చేస్తూ మిగతా నీటిని గేట్ల ద్వారా విడుదల చేస్తున్నారు. స్వర్ణ ప్రాజెక్ట్ పూర్తి నీటిమట్టం 1,183 అడుగులు కాగా పూర్తిగా నిండుకోవడంతో మూడు గేట్ల ద్వారా 20,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. బైంసా పట్టణంలోని గడ్డన్న సుద్ద వాగు ప్రాజెక్టు నీటిమట్టం 358.60 అడుగులు కాగా 25 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
శ్రీరాంసాగర్‌కు రికార్డు స్థాయి వరద
మహారాష్ర్టతో పాటు నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి నిజామాబాద్ ప్రాంతా ల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి మొట్టమొదటిసారిగా 1,49,359 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1,091 అడుగులు కాగా, ప్రస్తుతం 1,083.60 అడుగులకు చేరుకుంది. నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలకు గాను ప్రస్తుతం 54 టీఎంసీలకు చేరింది. పసుపుల వాగు ఉప్పొంగడంతో 12 గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. తాండూర్, కుంటాల, పెంబి, కడెం, సారంగాపూర్, కుబీర్ మండలాల్లో లో లెవెల్ వంతెనపై నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. బాసర వద్ద గోదా వరి పరవళ్లు తొక్కుతున్నది.
కోటపల్లి మండలంలో తెగిన రోడ్డు
మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం వరకు కురిసిన వర్షానికి పలు కాలనీలు, గ్రామాలు జలమయమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 5.3 సెం.మీ.ల వర్షపాతం నమోదయ్యింది. జన్నారం, లక్షెట్టిపేట, కాసిపేట, వేమనపల్లి, నెన్నెల, మంద మర్రి, జైపూర్, భీమారం, చెన్నూర్, కోటపల్లి మండలాల్లో 5 సెం.మీ.ల వర్షం కురిసింది. వర్షం కారణంగా ఓపెన్ కాస్టులలో బొగ్గు ఉత్పత్తి కూడా నిలిచిపోయింది.
కోటపల్లి మండలం ఎదుల్లబంధం, లింగన్నపేట గ్రా మాల మార్గ మధ్య రోడ్డు తెగిపోవడంతో ఏదుల్లబందం, సిర్సా, పుల్లగామ, ఆలుగామ, జనగామ, సుపాక, వెంచపల్లి, నందనంపల్లి గ్రామాలకు నియోజకవర్గ కేంద్రం నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. పత్తి చేలు నీటిలో మునిగిపోయాయి. జిల్లా కేంద్రంలోని హైటెక్‌సిటీ కాలనీ నీట మునిగింది.
ఎల్లంపల్లి ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తివేత
ఎగువ నుంచి వస్తున్న వరద, కడెం ప్రాజెక్టు గేట్ల ఎత్తివేతతో హాజీపూర్ మండ లం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద నీరు చేరుతున్నది. అధికారులు ప్రాజెక్టు 20 గేట్లు ఎత్తి 2 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. ప్రాజెక్టుకు వరద, కడెం ప్రాజెక్టు నుంచి 2,15,501 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో రాగా.. ఔట్ ప్లో 2 లక్షల క్యూసెక్కులు దిగువన గోదావరిలోకి వదిలారు.
కడెం నదిలో ఒకరి గల్లంతు
నిర్మల్ జిల్లా కడెం నదిలో శనివారం అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి వరదలో చిక్కుకొని గల్లంతయ్యాడు. కడెం మండలంలోని కన్నాపూర్ గ్రామానికి చెందిన గంగాధర్ మధ్యాహ్నం కడెం నదిలో చేపలు పడుతుండగా.. ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో ఒక్కసారిగా వరద అతని చుట్టుముట్టింది. నది నుంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలించలేదు.
కొద్దిసేపు నదిలో ఉన్న ఓ ఎత్తున ప్రదేశంలో ఉండి రక్షణ కోసం వేచి చూసినా.. వరద కారణంగా రక్షించేందుకు వీలు లేకుండా పోయిందని స్థానికులు తెలిపారు. వరద మరింత పెరగడంతో నీటిలో కొట్టుపోతున్న అతని చూసిన కొందరు ఫోన్‌లో చిత్రీకరించారు. పోలీసులు అతడి కోసం నదిలో గాలిస్తున్నారు.