17-08-2025 01:20:14 AM
‘షోలే’. మరుపురాని భారతీయ చిత్రాల్లో ఇదీ ఒకటి. ఇంకా చెప్పాలంటే ఇండియన్ సినిమా హిస్టరీలో ఈ సినిమాది ప్రత్యేక ఆధ్యాయం. యాక్షన్ విషయంలో అదో విప్లవం. ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న ఈ క్లాసిక్ సినిమా విడుదలై ఈ యేటితో 50 ఏళ్లు పూర్తయ్యాయి. 1975, ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా ఇటీవలే అర్ధ శతాబ్ది మైలురాయిని చేరుకోవటంతో ప్రేక్షక లోకమంతా దీని గురించే మాట్లాడుకుంటోంది. సినీప్రియుల గుండెల్లో అంతలా నిలిచిపోయిన సినీరాజం ‘షోలే’ సంగతులు కొన్ని..
మరింత కొత్తగా...
‘షోలే’ ఇప్పటికే 70 ఎంఎం, 35 ఎంఎం, సినిమా స్కోప్, 3డీ వెర్షన్లతో ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రాన్ని ఇటీవలే 4కే టెక్నాలజీతో రూపొందించారు. ఈ సినిమాలో డైరెక్టర్స్ కట్ ప్రకారం విలన్ చివరలో చనిపోతాడు. ఆ వెర్షన్‌కే మోడరన్ టెక్నాలజీ హంగులు అద్దారు.
4కేలోకి అనుసంధానం చేసిన ఈ సినిమాను ఈ మధ్యే ఇటలీలో ప్రదర్శించా రు. 3.24 గంటల డైరెక్టర్స్ కట్‌ను ఈ ఏడాది సెప్టెంబర్ 6న టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శించనున్నారు. 4కేలో కనువిందు చేయనున్న ఈ సినిమాను మన దేశంలో ఎప్పుడు విడుదల చేస్తారనే విషయాన్ని మాత్రం ఇంకా మేకర్స్ నిర్ణయించలేదు.
బాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే గొప్ప సినిమా ల్లో ‘షోలే’ అప్పట్లో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిం ది. జపనీస్ మూవీ ‘సెవన్ సమురాయ్’ ప్రేరణతో రూపకల్పన చేసిన సినిమా ఇది. ఈ సినిమాలో ధర్మేంద్ర, సంజీ వ్‌కుమార్, అమితాబ్ బచ్చన్, జయబాధురి, అంజాద్ ఖాన్ కీలక పాత్రలు పోషించారు. దర్శకుడు రమేశ్ సిప్పీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆయనకిది మూడో సినిమా. దీనికి ఆయన తండ్రి జీపీ సిప్పీ నిర్మాత కాగా, సలీమ్ రచయితలుగా పనిచేశారు.
రెండు వారాల తర్వాత ప్రభం‘జనం’
షోలే విడుదలయ్యేటప్పటికే భక్తిరస చిత్రం ‘జై సంతోషిమా’ థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది. అందు కే యాక్షన్ ప్రధానంగా రూపొందిన ‘షోలే’ వైపు జనం దృష్టి పెట్టలేదు. కానీ, ఆర్డీ బర్మన్ స్వరపర్చిన పాటలు సంగీత ప్రియులను అలరిస్తూ మెల్లగా ఈ సినిమా టాక్ స్ప్రెడ్ అయ్యింది. అంతకుముందు చూసినవారంతా ఫ్లాప్ అంటూ పెదవి విరిచారు.
రెండు వారాల తర్వాత అందరి నీ సంభ్రమాశ్చర్యానికి గురిచేస్తూ ‘షోలే’ థియేటర్లన్నీ ‘హౌస్‌ఫుల్’ బోర్డులతో కనిపించాయి. ముంబయి మినర్వా థియేటర్‌లో ఈ సినిమా ఏకధాటిగా మూడేళ్లపాటు నాలుగు ఆటలతో ప్రదర్శితమైంది. తర్వాత రెండేళ్లు ఒక్క ఆటతో ప్రేక్షకాదరణ పొందింది. ముఖ్యంగా ఇందులోని ‘గబ్బర్‌సింగ్’ పాత్ర ఓ బందిపోటు ఆధారంగా రూపొందించింది.
బాలీవుడ్ చరిత్రలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన విలన్ పాత్రల్లో ఇదొకటి. ఈ పాత్ర పోషించిన అంజాద్ ఖాన్ విశేష ప్రేక్షకాదరణ పొందారు. ఈ రోల్ ఆయనకు నిక్‌నేమ్‌గా మారటమే కాక ఆయన కెరీర్‌ను సైతం మలులు తిప్పింది. ఓ నటుడు ప్రతినాయక పాత్రతో దేశవ్యాప్త అభిమానులను సంపాదించుకోవటం ‘షోలే’తోనే ఆరంభమైంది.
ఎన్టీఆర్ సొంత థియేటర్‌లో 80 వారాల పాటు..
దేశవ్యాప్తంగా సగటు ప్రేక్షకున్ని కట్టి పడేసిన ‘షోలే’ తెలుగు నాట గోల్డెన్ జూబ్లీ వేడుకలు జరుపుకుంది. దేశవ్యాప్తంగా శత దినోత్సవం జరుపుకున్న ఎక్కువ కేంద్రాలు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనివే. ఎన్టీఆర్ సొంత థియేటర్ రామకృష్ణ 70 ఎంఎంలో ఈ సినిమా 80 వారాలకుపైగా ఆడింది. ఆ రికార్డు ఇప్పటికీ ‘షోలే’ పేరు మీదే ఉండటం విశేషం. దేశవ్యాప్తంగా 100 థియేటర్లలో 100 రోజులు ఆడిన సినిమా ఇప్పటికీ హిందీ చిత్రసీమలో మరోటి రాలేదంటే నమ్మండి.
ఎన్నో రికార్డులు..
భారతీయ సినీపరిశ్రమలో తొలి ‘70 ఎంఎం స్టీరియోఫోనిక్ సౌండ్ ఫిల్మ్’ ఇదే. దీని బడ్జెట్ రూ.3 కోట్లు కాగా, 35 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. ముంబయిలోని మినర్వా థియేటర్‌లో ఈ సినిమా ఐదేళ్లపాటు ప్రదర్శితమైంది. 100కు పైగా థియేటర్లలో 175 రోజులు ఆడి సిల్వర్ జూబ్లీ వేడుక జరుపుకున్న సినిమా కూడా ఇదే. ప్రపంచవ్యాప్తం గా ఫుల్న్‌ల్రో దాదాపు 25 కోట్ల టికెట్లు అమ్ముడైన ఏకైన భారతీయ సినిమా ఇది.
‘బ్రిటిష్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్’ టాప్ 10 భారతీయ సినిమాల జాబితాలో తొలి స్థానం దీనిదే. ఈ సినిమా గొప్పదనాన్ని పేర్కొంటూ ‘ఫిల్మ్ ఆఫ్ ది మిలీనియన్’, ‘స్టార్ వార్స్ ఆఫ్ బాలీవుడ్’ అని బీబీసీ అభివర్ణించింది. రీరిలీజ్‌లోనూ క్రేజ్ తగ్గలేదు. రూ.13 కోట్ల వసూళ్లతో అత్యధిక కలెక్షన్స్ చేసిన ఐదో భారతీయ చిత్రంగా రికార్డు దీని సొంతం. 1995లో తొలిసారిగా దూరదర్శన్‌లో ప్రసారమై, 76 టీఆర్పీ రేటింగ్‌తో రికార్డు నెలకొల్పింది.
ఆసక్తికర విశేషాలు..
* సినిమా మొత్తం షూటింగ్ పూర్తి కావడానికి రెండున్నరేళ్ల కాలం పట్టింది.
* ఈ చిత్రంలోని ‘యే దోస్తీ’ పాటను 21 రోజుల్లో చిత్రీకరించారు. జయభాదురి దీపాలు వెలిగించే సన్నివేశం చిత్రీకరణకు 19 రోజులు పట్టింది.
* కర్ణాటకలోని రామనగరలో ఈ సినిమా షూటింగ్ జరగ్గా.. ఆ ప్రాంతం టూరిస్ట్ స్పాట్‌గా నిలిచింది.
* యాక్షన్ సీన్ షూట్‌లో అమితాబ్ చెవి పక్క నుంచి తూటా దూసుకెళ్లింది.. ప్రమాదం తప్పింది.
* సెన్సార్ బోర్డు సూచనలతో క్లుమైక్స్ మార్చారు. దాంతో సినిమాలో హింస తగ్గింది.
* ఈ సినిమా లండన్‌లో ఎడిటింగ్ జరిగింది. 70 ఎంఎం రీల్స్‌ను ఇండియాకు తీసుకురావడాన్ని అప్పటి ప్రభుత్వాధికారులు తిరస్కరించారు.
* తొలుత అట్టర్ ఫ్లాప్ టాక్ వచ్చింది. నిర్మాత పారిపోబోతున్నాడని వదంతులు రావటంతో ఫైనాన్షియర్లంతా అలర్ట్ అయ్యారు.
* తర్వాత మెల్లగా ప్రభంజనం మొదలైంది. దేశంలో 18 కోట్ల మంది చూసిన సినిమాగా రేర్ రికార్డు ‘షోలే’ సొంతం.
* ఈ సినిమా ప్రారంభమయ్యే నాటికే అమితాబ్, జయ దంపతులయ్యారు. సినిమా విడుదలైన ఐదేళ్లకు ధర్మేంద్ర, హేమామాలిని కూడా ఒక్కటయ్యారు.
* అమితాబ్ నటించిన జయదేవ్ పాత్రలో నటించే అవకాశం ముందుగా శత్రుఘ్న సిన్హాకు వచ్చింది. కానీ, ఆయన మిస్ చేసుకున్నారు.
* ధర్మేంద్రకు రూ.15 లక్షలు, సంజీవ్‌కుమార్‌కు రూ.1.25 లక్షలు, అమితాబ్‌కు రూ.లక్ష పారితోషికం అందింది.
* ఈ సినిమా టికెట్‌ను అమితాబ్ బచ్చన్ ఎంతో అపురూపంగా దాచుకున్నారు.ఆ టికెట్ ధర రూ.20.
* ‘షోలే, ఏ కల్చరల్ రీడింగ్’, ‘షోలే: ఏ క్లాసిక్’ పేర్లతో ఈ సినిమా విశేషాలు తెలిపే పుస్తకాలు సినీప్రియులకు అందుబాటులోకి వచ్చాయి.
* ఈ మూవీ థీమ్‌తో ‘షోలే రామ్‌ఘర్ ఎక్స్‌ప్రెస్’, ‘షోలే ఆఫ్ జస్టిస్’ వీడియో గేమ్స్ రూపొందడం విశేషం.
* ఇప్పుడు యూట్యూబ్‌తోపాటు అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌లాంటి ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది.