calender_icon.png 11 December, 2025 | 4:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో కార్మికురాలు మృతి

10-12-2025 12:18:08 AM

నార్సింగి(చేగుంట), డిసెంబర్ 9 : జాతీయ రహదారి 44 పై చెట్లు, కొమ్మలను   తొలగిస్తుండగా వాహనం ఢీ కొట్టి కార్మికురాలు మృతి చెందగా పలువురు గాయపడిన సంఘటన నార్సింగి మండల పరిధిలోని   వల్లూరు శివారులో జరిగింది. నార్సింగి ఎస్‌ఐ బీమరి సృజన తెలిపిన వివరాల ప్రకారం చేగుంట మండలం వడియారం గ్రామానికి చెందిన గూన సత్తెమ్మ (49) గత రెండు సంవత్సరాలుగా జీఎంఆర్ రోడ్డు మెయింటెనెన్స్ కాంట్రాక్టర్ వద్ద కాంట్రాక్ట్ లేబర్ గా పనిచేస్తుంది. 

రోజు మాదిరిగా విధులకు హాజరైన సత్తెమ్మ వల్లూరు వద్ద జాతీయ రహదారి 44 పై డివైడర్ పై ఉన్న పూల చెట్ల వద్ద సఫాయి పనికి వెళ్ళింది. ఈ క్రమంలో సత్తెమ్మ చెత్తను రోడ్డు పక్కగా వేయడానికి వెళుతుండగా నిజామాబాద్ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళుతున్న ఇన్నోవా కారు డ్రైవర్ అతివేగంగా నడుపుతూ ముందు వెళుతున్న అటోను ఢీ కొట్టగా, అటో రోడ్డు కు పక్కగా ఉన్న సత్తెమ్మ ను ఢీ కొట్టింది.

ఆటో ను కారు బలంగా ఢీ కొట్టడం వల్ల ఆటోతో సహా సత్తెమ్మ ఎగిరి రోడ్డు పక్కన గల గుంతలో పడిపోయారు. దీంతో సత్తమ్మ మృతి చెందగా, అటో లో ప్రయాణిస్తున్న అటో డ్రైవర్ హాలావత్ సుధాకర్, ప్రయాణికులు స్వరూప, స్వప్న, దుర్గయ్య లకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ కారును రోడ్డుపై వదిలి పారిపోయాడు.

గాయపడిన వారిని చేగుంట లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా, ప్రమాదంలో మరణించిన సత్తెమ్మ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం రామాయంపేట కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బీమరి సృజన తెలిపారు. ఆటోను ఢీ కొట్టిన కారు పై ‘నిర్మల్ జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు‘ అని బోర్డు ఉంది.