10-12-2025 12:19:57 AM
గజ్వేల్, డిసెంబర్ 9: గ్రామాల్లో సర్పంచ్ అభ్యర్థుల దూకుడు కొనసాగుతుంది. కాంగ్రెస్, బిఆర్‌ఎస్, బిజెపి పార్టీలతోపాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటాపోటీగా తమ ప్రచారాన్ని కొనసాగించారు. మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థుల తరఫున పలు గ్రామాలలో ప్రచారాన్ని కొనసాగించగా, బిఆర్‌ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి గజ్వేల్, వర్గల్, మర్కుక్ మండలాల పరిధిలోని పలు గ్రామాలలో బిఆర్‌ఎస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు.
ర్యాలీలలో భారీగా జన సమీకరణ చేస్తూ సర్పంచి అభ్యర్థులు తమ ఉనికిని చాటుకున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రచారం గడువు ముగియవడంతో రహస్య ప్రచారాన్ని ప్రారంభించారు. అభ్యర్థుల గుర్తులకు సంబంధించిన వస్తువులను ఇంటింటా పంపిణీ చేశారు. గత వారం రోజులుగా ఇంటింటికి మద్యం సీసాలు, చికెన్, మటన్ పంపిణీ చేయడంతో పాటు ఆయా గ్రామాలలో ప్రత్యేకంగా విందులను ఏర్పాటు చేశారు. గురువారం సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ఉండడంతో ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి నగదు పంపిణీకి ఆయా పార్టీల అభ్యర్థులు సిద్ధమవుతున్నారు.
సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రత్యేక సిబ్బంది గ్రామాలలో తనిఖీ నిర్వహిస్తూనే ఉన్నారు. కమిషనర్ ఆదేశాలతో పోలీసులు, రెవెన్యూ అధికారులు గ్రామ గ్రామాన ఓటర్లను అభ్యర్థులు మభ్య పెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలను పరిశీలిస్తూ అడ్డుకుంటున్నారు. ఇప్పటికే చాలా గ్రామాలలో మద్యం సీసాలను, గుంపులుగా మద్యం సేవిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అభ్యర్థులు మరింత జాగ్రత్తగా మద్యం పంపిణీ చేస్తూ నగదు పంపిణీ సైతం ఏర్పాటు చేసుకుంటున్నారు.