20-05-2025 01:26:32 PM
టేకులపల్లి, (విజయక్రాంతి): 20న దేశవ్యాప్త సమ్మెకు బదులుగా టేకులపల్లి మండలం(Tekulapalli Mandal) సింగరేణి కోయగూడెం ఉపరితలగనిలో మంగళవారం ఉదయం షిఫ్ట్ లొ కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్రోటెస్ట్ డే నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఐటియుసి బ్రాంచ్ కార్యవర్గ సభ్యులు అజ్మీరా కీషోర్, ఐఎన్టీయుసి భుక్యా నాగేశ్వరరావు, ఐఎఫ్టియు భయ్యా వరప్రసాద్, మాట్లాడుతూ.. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని, కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ లుగా మార్చిందని వారు ఆరోపించారు.
దీని వల్ల ఇప్పుడు కార్మిక వర్గం అనుభవిస్తున్న అనేక హక్కులు హరించిపోతాయని వారు తెలిపారు. కార్మిక చట్టాల మార్పు వల్ల సింగరేణి కి నూతన గనులు రావడం లేదని, పని గంటలు పెంచే అవకాశం ఉందని, సమ్మె చేసే హక్కు ఉండదని, నాలుగు లేబర్ కోడ్ ల వల్ల ఉన్న హక్కులు పోతాయని వారు పేర్కొన్నారు. సింగరేణి లో కొత్త గనులు వస్తనే మనుగడ కొనసాగుతుందని, ఉద్యోగ భద్రత ఉంటుందని వారు అన్నారు. కార్మికుల శ్రమ దోపిడి ని బడా పారిశ్రామిక సంస్థలకు మోడి ప్రభుత్వం దోచి పెడుతుందని వారు విమర్శించారు ఈ నిరసన కార్యక్రమంలో ఎఐటియుసి, ఐఎన్టీయుసి, ఐఎఫ్టియు నాయకులు భూక్యా బాలు కుమార్, సామల శ్రీనివాస్, కొసూరి సత్యనారాయణ, జిఎ శ్రీనివాస్, గుగులొత్ బాసు తదితరులు పాల్గొన్నారు.