calender_icon.png 22 July, 2025 | 5:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థినులకు పురుగుల అల్పాహారం!

22-07-2025 12:17:50 AM

- వార్డెన్, ప్రిన్సిపాల్‌పై సస్పెన్షన్ వేటు

- సస్పెన్షన్ ఎత్తివేయాలని విద్యార్థినుల ఆందోళన

- భద్రాచలం గిరిజన గురుకులంలో ఘటన

భద్రాచలం, జూలై 21: భద్రాచలం శివారులో గల గిరిజన గురుకుల బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థినులకు పురుగులు ఉన్న అల్పాహారం పెడుతున్నారనే ఆరోపణతో కళాశాల ప్రిన్సిపాల్ ఏ పద్మావతి, వార్డెన్ బి రాజేశ్వరులను సస్పెండ్ చేస్తూ గురుకులాల కార్యదర్శి సీతామాలక్ష్మి ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. శనివారం ఉదయం గురుకుల కళాశాలలో విద్యార్థినులకు ఏర్పాటు చేసిన అల్పాహారంలో పురుగులు వచ్చాయి.

తినకుండా తరగతులకు వెళ్ళిన విద్యార్థినులకు ప్రిన్సిపాల్ పద్మావతి, వార్డెన్ రాజేశ్వరి బిస్కెట్లు ఇచ్చారు. పురుగులు పట్టిన అల్పాహారం పడేసి, తిరిగి అల్పాహారం ఏర్పాటు చేశారని విద్యార్థులు తెలిపారు. వెంటనే పురుగులు ఉన్న బియ్యాన్ని తిరిగి వెనక్కి పంపించారని చెప్పారు. వారి తప్పేమీ లేదని, సస్పెండ్ చేసిన ఇద్దరిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ కళాశాల ఎదుట సోమవారం విద్యార్థినులు ధర్నా నిర్వహించారు.

కాగా ఎటువంటి విచారణ జరపకుండా ఏకపక్షంగా సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. కాలేజీ అధ్యాపకులలో ఉన్న కొంత మంది.. ప్రిన్సిపాల్ తమ మాట వినడం లేదనే ఆక్రోశంతో తప్పుడు వార్తలు సృష్టించి ఈ సంఘటనకు కారణమయ్యారని ఆరోపిస్తున్నారు.