calender_icon.png 15 September, 2025 | 2:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీళ్లున్నా రోజూ సరఫరా లేదు

15-09-2025 12:09:47 AM

తాగునీటి సరఫరాపై ప్రజారోగ్యశాఖ నిర్లక్ష్యం

కరీంనగర్, సెప్టెంబరు 14 (విజయ క్రాంతి): కరీంనగర్ నగర ప్రజలకు లోయర్ మానేరు డ్యాం నుంచి తాగునీటి సరఫరా జరుగుతుంది. డెడ్ స్టోరేజీ వరకు కూడా నగరవాసులకు తాగునీరందించేందుకు వీలుగా పైపులైన్ నిర్మాణం చేశారు. అయితే వేసవి నుండి నేటికి కరీంనగర్ నగర ప్రజలకు నీటి సరఫరా ప్రతిరోజు కొనసాగడం లేదు. వేసవి పూర్తయి వర్షాకాలం ప్రవేశించినా ప్రాజెక్టులోకి నీళ్లు వచ్చి 15 రోజులు దాటినా నేటికి రెండు మూడు రోజులకొకసారి అది కూడా అరగంట వరకే నీటి సరఫరా చేస్తున్నారు.

ప్రజారోగ్యశాఖ నీటి సరఫరా విషయంలో అలసత్వం వహిస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. గత నెల మొదటి వారం వరకు ఎల్‌ఎండీలో 6టీఎంసీల నీరు ఉండగా ప్రస్తుతం పూర్తిస్థాయి 23 టీఎంసీలకు చేరుకుంది. ఇన్ పెరగడంతో మూడు రోజులుగా గేట్లు ఎత్తి దిగువకు కాకతీయ కాలువకు నీటిని విడుదల చేస్తున్నారు. అయినా నగరవాసులకు రోజువారీ నీటి సరఫరా జరగడం లేదు.

ఒక్క హౌజింగ్ బోర్డు కాలనీలో మాత్రం 24/7 కింద నీటి సరఫరా నిరంతరంగా కొనసాగుతుంది. 65 మిలియన్ లీటర్ల నీటిని ఎల్‌ఎండీ నుంచి రెండు ఫిల్టర్ బెడ్లకు చేరుతుంటాయి. వీటిని శుద్ధి చేసిన అనంతరం 62 మిలియన్ లీటర్ల త్రాగునీరును సరఫరా చేస్తుంటారు. కరీంనగర్ నగరంలో 60 వేల నల్లా కనెక్షన్లు ఉన్నాయి. అయితే అధికారుల అలసత్వం కారణంగా ప్రతిరోజు నీటి సరఫరా జరగడం లేదు.

నిరంతరం నీటి సరఫరా జరపాలి..

ప్రస్తుతం ఎఫ్‌ఎండీకి వరదనీరు వచ్చి పూర్తిస్థాయిలో నీటిమట్టం ఉంది. అధికారులు అతసత్వం వీడి ప్రతిరోజు తాగునీటి సరఫరా చేయాలి. చాలా ప్రాంతాల్లో మూడు రోజులకొకసారి మాత్రమే నీటి సరఫరా చేస్తున్నారు. గతంలో సరఫరా చేసిన మాదిరిగా 45 నిమిషాల నుంచి గంటపాటు పూర్తిస్థాయి ప్రెషర్తో ప్రతిరోజు తాగునీటి సరఫరా చేయాలి. ఈ విషయమై కమిషనర్ను కలిసి వినతిపత్రం సమర్పించాం. అమ్మృత్-2 కింద పలు ప్రాంతాల్లో పైపులైన్ నిర్మాణం పూర్తయింది. కొత్త కనెక్షన్ దారులకు నీటి సరఫరా అందించాల్సి ఉంది. దీనిపై ప్రజారోగ్యశాఖ, మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలి.

మాజీ మేయర్ 

యాదగిరి సునీల్ రావు