27-11-2025 12:00:00 AM
ఒకే సిటింగ్‌లో తొలగించిన ఏఐఎన్యూ వైద్యులు
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 26 (విజయక్రాంతి): వరంగల్ ప్రాంతానికి చెందిన ఎనిమిదేళ్ల బాలుడికి ఎడమవైపు కిడ్నీ నిండా రాళ్లు ఏర్పడటంతో అతడిని హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్యూ)కు తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలు, పిల్లల్లో కిడ్నీ రాళ్ల సమస్యల గురించి ఏఐఎన్యూకు చెందిన కన్సల్టెంట్ పీడియాట్రిక్, ట్రాన్సిషనల్ యూరాలజిస్ట్ డాక్టర్ పి.అశ్విన్ శేఖర్ ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు.
‘బాలుడిని ఇక్కడకు తీసుకురాగానే సమస్యను గుర్తించి, పెర్క్యుటేనియస్ నెఫ్రో లితోటమీ (పీసీఎన్‌ఎల్) చేయాలని నిర్ణయించాం. ఇందులోభాగంగా వీపు భాగంలో చిన్న రంధ్రం చేసి, నెఫ్రోస్కోప్ ద్వారా కిడ్నీలోకి వెళ్లి ఎక్కువ నొప్పి లేకుండా రాళ్లను తొలగించాం. అత్యాధునిక సాంకేతికను ఉపయోగించడం ద్వారా ఒక పెద్దరాయి, మరికొన్ని చిన్నరాళ్లు అన్నింటినీ ఒకే సిటింగ్‌లో తొలగించాం. సంప్రదాయ శస్త్రచికిత్సల కంటే ఇందులో త్వరగా కోలుకుంటారు. దీనివల్ల ఆస్పత్రిలో ఉండాల్సిన సమయం తగ్గుతుంది’ అన్నారు. రోజుకు కనీసం లీటరున్నర మూత్రం పోయేలా నీళ్లు తాగాలని సూచించారు. అలా తాగకపోతే మూత్రం చిక్కబడుతుంది. అదే కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి సూచిక అన్నారు.