20-09-2025 12:00:00 AM
బాధితుడు రాజ్ కుమార్కు భరోసానిచ్చిన ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్
మణికొండ ;సెప్టెంబర్19: ‘ధైర్యంగా ఉండు, మేమంతా నీకు అండగా ఉన్నాం,‘ అంటూ దాడికి గురైన రాజ్ కుమార్కు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ భరోసా ఇచ్చారు. శుక్రవారం మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని వెంకటేశ్వర కాలనీలో ఉన్న బాధితుడి ఇంటికి ఆయన స్వయంగా వెళ్లి పరామర్శించారు. రాజ్ కుమార్ ఆరోగ్య పరిస్థితిని, దాడికి దారితీసిన కారణాలను అడిగి తెలుసుకున్నారు.
కాలనీ సమస్యలపై భేదాభిప్రాయాలు సహజమని, వాటిని సామరస్యపూర్వక చర్చలతో పరిష్కరించుకోవాలి తప్ప, భౌతిక దాడులకు దిగడం అమానుషమని హితవు పలికారు. ‘ఇలాంటి దాడుల సంస్కృతి మంచిది కాదు. ఘటనలు పునరావృతం కాకుండా ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలి‘ అని ఆయన సూచించారు.వెంకటేశ్వర కాలనీ జనరల్ బాడీ సమావేశంలో ఏ చిన్న సమస్య తలెత్తినా,
పరిష్కారం కోసం నేరుగా తనను సంప్రదించాలని, సంపూర్ణ సహకారం అందిస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.ఈ పరామర్శలో ఎమ్మెల్యే వెంట మాజీ చైర్మన్ కస్తూరి నరేందర్ ముదిరాజ్, తలారి మల్లేష్ ముదిరాజ్, జితేందర్, ఆల్ కాలనీస్ ఫెడరేషన్ అధ్యక్షులు వంశీ, కోశాధికారి రవీందర్రెడ్డి తదితరులు ఉన్నారు.