calender_icon.png 23 November, 2025 | 4:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

'పైల్స్' చికిత్స వికటించి యువకుడు మృతి

23-11-2025 04:40:17 PM

హయత్ నగర్ లో మృతుడి కుటుంబీకుల ఆందోళన 

ఎల్బీనగర్: పైల్స్ కోసం తీసుకుంటున్న వైద్య చికిత్స వికటించి యువకుడు మృతి చెందిన ఘటన శనివారం రాత్రి హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. మేడ్చల్ జిల్లా మల్లాపూర్ లోని ఎన్టీఆర్ నగర్ లో ఉంటున్న చెమ్మ రవితేజ(17) ఇంటర్ చదువుతున్నాడు. ఇతను కొద్దిరోజులుగా పైల్స్ వ్యాధితో బాధపడుతున్నాడు. చికిత్స కోసం రవితేజను హయత్‌నగర్‌లోని సైదా పైల్స్ క్లినిక్‌కు తీసుకెళ్లగా, శస్త్రచికిత్స చేయాలని అక్కడి వైద్యుడు సూచించారు. ఆ రోజు ఆసుపత్రిలోనే ఉండి, మరుసటి రోజు ఇంటికి తిరిగి వచ్చారు. ఏదైనా సమస్య తలెత్తితే తిరిగి రావాలని డాక్టర్ సలహా ఇచ్చారు.

రవితేజ తీవ్ర రక్తస్రావంతో బాధపడుతుండటంతో తిరిగి 12వ తేదీన ఆసుపత్రికి వచ్చారు. ఆ రోజు నుంచి వారు ప్రతిరోజూ ఉదయం చికిత్స కోసం తీసుకెళ్లి, తరువాత ఇంటికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో రవితేజ తీవ్ర అనారోగ్యం, జ్వరం రావడంతో క్లినిక్‌కు తీసుకువచ్చారు. పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్ సూచించడంతో చైతన్యపురిలోని ఒక మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ కొంతకాలం చికిత్స పొంది, తరువాత ఎల్బీనగర్‌లోని రష్ కేర్ ఆసుపత్రికి తరలించారు. 22వ తేదీన రవితేజ పరిస్థితి చాలా విషమంగా ఉందని, చెప్పడంతో పంజాగుట్టలోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డ్యూటీ వైద్యులు పరీక్షించి, రవితేజ చనిపోయినట్లు ప్రకటించారు. చికిత్సలో నిర్లక్ష్యం కారణంగానే తన కొడుకు మరణించాడని ఆరోపిస్తూ, సైదా పైల్స్ క్లినిక్ వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని మృతుడి తల్లి పద్మ హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నట్లు సీఐ నాగరాజు గౌడ్ తెలిపారు.