14-10-2025 08:27:28 PM
తన భూమిని బడా నిర్మాణ సంస్థకు కట్టబెడుతున్నారని ఆరోపణ..
కుత్బుల్లాపూర్ (విజయక్రాంతి): తన భూమిని బడా నిర్మాణ సంస్థకు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఓ యువకుడు దుండిగల్ తహసీల్దార్ కార్యాలయం ముందు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేశాడు. దుండిగల్ తండా 1 కు చెందిన సిద్దుకు, సర్వే నెంబర్ 148,150లో కొంత భూమి ఉంది. అయితే గతంలో పాస్ బుక్ ల కోసం 6 లక్షలు డిమాండ్ చేశారని, అందుకే తన అన్న ఆత్మహత్య చేసుకున్నాడని యువకుడు సిద్దు నాయక్ ఆరోపించాడు. డబ్బులు ఇవ్వనందుకే తమకు పాస్ బుక్ లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు కోర్ట్ ఆర్డర్ కాపీ కూడా ఉందని, గతంలో తహసీల్దార్ కు అందజేశానని తెలిపాడు. తహసీల్దార్ ను పాస్ బుక్ లు ఇవ్వండని అడిగితే మమ్మల్ని బెదిరిస్తున్నాడని ఆరోపించాడు.ఆ భూమిపై తమ కుటుంబం ఆధారపడి ఉందని, పాస్ బుక్ లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు.