16-08-2024 08:42:20 PM
కామారెడ్డి: యువత చెడు వ్యసనాలకు లోను కాకుండా మహానీయుల ఆశయ సాధనలో నడవాలని ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు అన్నారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో శుక్రవారం సాహిత్య రత్న, లోక శాహిర్ అన్నా భావు సాఠే 104వ జయంతి వేడుకలలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు మద్నూర్ మండల కేంద్రంలోని అన్నా భావు సాఠే విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ... ప్రతీ ఏటా మహనీయుల జయంతి వేడుకలు జరుపుకోవడమే గాక వారు చూపించిన మార్గాల్లో నడవాలని వారి ఆశయ సాధనల కోసం పునరంకితం కావాలని సూచించారు. యువత చెడు అలవాట్లను వదిలేసి సన్మార్గంలో నడవాలాని ఆశించారు. జుక్కల్ నియోజకవర్గంలో దళితులు ఇంకా సొంత ఇళ్లు లేక ఉపాధి అవకాశాలు లేక అత్యంత పేదరికంతో దయనీయ స్థితిలో బతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగిపోయి అందరూ గౌరవంగా జీవించాలంటే అది కేవలం విద్య వల్లే సాధ్యం అవుతుందని అన్నారు. అందుకే అందరూ తమ పిల్లలను బాగా చదివించాలని కోరారు. దళిత గిరిజన బడుగుబలహీన వర్గాలకు చెందిన పిల్లల విద్యాభివృద్ధికి తాను కృషి చేస్తానని అన్నారు.