28-08-2025 05:14:16 PM
గచ్చిబౌలి (విజయక్రాంతి): రానున్న గణేశ్ ఉత్సవాల నిమజ్జనానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. గురువారం శేరిలింగంపల్లి జోన్ పరిధిలో పర్యటించిన జోనల్ కమిషనర్ హేమంత్ బోర్ఖడే ఐఏఎస్(Zonal Commissioner Hemant Borkhade IAS), శానిటేషన్ పరిస్థితులు, రోడ్ల స్థితి, చెరువులను పరిశీలించి సూచనలు చేశారు. ఆగస్టు 27 నుంచి సెప్టెంబర్ 7 వరకు జరిగే ఉత్సవాలు సజావుగా, ఆహ్లాదకరంగా జరగాలని సమన్వయంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా దుర్గం చెరువు, మల్కం చెరువు, గోపి చెరువు, నల్లగండ్ల చెరువులను పరిశీలించారు. సాకి చెరువు వద్ద గల బేబీ పాండ్ ను నిమజ్జనం కోసం సిద్ధం చేయాలని సూచించారు. గంగారం చెరువు పరిసరాల్లో డెంగ్యూ కేసులు నమోదవడంతో తక్షణ చర్యలు తీసుకోవాలని ఎంటమాలజీ శాఖకు ఆదేశించారు. చెరువులోని వాటర్ హై సిల్టింగ్ తొలగించి, వ్యర్థాలను వారం రోజుల్లో తొలగించాలని స్పష్టం చేశారు. నిమజ్జన ప్రదేశాల్లో భక్తులకు మౌలిక వసతులు కల్పించాలని, డార్క్ స్పాట్స్ వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విగ్రహాల ర్యాలీ రహదారులు బాగుండేలా, పాట్ హోల్స్ వెంటనే పూడ్చాలని, ప్రొసీషన్ రూట్లలో బిటి రోడ్లపై డిడిఏం లేయర్ పనులు చేపట్టాలని సూచించారు. ఈ తనిఖీలో శానిటేషన్, లేక్స్, ఇంజనీరింగ్ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.