28-08-2025 05:03:36 PM
బాన్సువాడ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో గత రెండురోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పట్టణంలోని పలు కాలనీలు నీట మునిగి, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షపు నీరు రహదారులపై చేరి రాకపోకలకు అంతరాయం కలిగించడంతో పాటు, కాలనీల్లో నిలిచిపోయి ప్రజల జీవన విధానాన్ని దెబ్బతీస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు(Agro Industries Chairman Kasula Bala Raju) పట్టణంలోని పలు ప్రాంతాలను స్వయంగా ఆయనతో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి రాజు, మున్సిపల్ ఇంజనీర్లతో పరిశీలించారు. పట్టణ ప్రధాన రహదారిపై ఉన్న ఎస్‌బీఐ సమీపం, హోండా షోరూమ్ పరిసరాలు పరిశీలించారు.
ప్రజలు ఇబ్బందులు పడకుండా వెంటనే పంపింగ్ మిషన్లు, డ్రైనేజీ మార్గాలను ఉపయోగించి నీటిని తొలగించాలనీ ఆదేశించారు. శాశ్వత పరిష్కారం కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలి అని ఆయన అధికారులకు స్పష్టం చేశారు. అనంతరం సాయి కృపా నగర్‌లో పర్యటించారు. అక్కడ స్థానికులు ఎదుర్కొంటున్న సమస్యలు రహదారులు దెబ్బతినడం, కాలువలు మూసుకుపోవడం, వర్షపు నీరు ఇళ్లలోకి చేరడం వంటి సమస్యలను ప్రజలు వివరించారు. కాసుల బాలరాజు తక్షణ చర్యలు చేపట్టారు. అనంతరం కల్కి చెరువు కట్టను పరిశీలించారు. తక్షణ సమస్యలు పరిష్కరించడమే కాకుండా, శాశ్వతంగా వర్షాల సమస్యలు తలెత్తకుండా మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తాం అని ఆయన అన్నారు.