28-08-2025 07:19:30 PM
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి..
చిట్యాల (విజయక్రాంతి): ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలలో ప్రసవాల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి(District Collector Ila Tripathi) ఆదేశించారు. గురువారం ఆమె నార్కెట్ పల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓపి, ఏఎన్ సి, మందుల స్టాక్ రిజిస్టర్ లను పరిశీలించిన అనంతరం ప్రసవాలు, గర్భిణీ స్త్రీల సంఖ్య, ఏఎన్ సి పరీక్షలు, తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. పిహెచ్ సి లలో సాధారణ ప్రసవాలను పెంచాలని చెప్పారు. కుక్క కాట్ల వివరాలను సైతం జిల్లా కలెక్టర్ అడిగారు. ప్రజలు వీధికుక్కల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని, కుక్క కాటుకు గురైన వారికి రేబిస్ వ్యాధి సోకకుండా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు.
గ్రామపంచాయతీ సహకారంతో కుక్కలకు స్టెరిలైజేషన్ చేయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మండలంలో ఇందిరమ్మ ఇండ్ల పురోగతి తక్కువగా ఉన్నందున గ్రౌండింగ్ ను పెంచాలని చెప్పారు. అంతకు ముందు జిల్లా కలెక్టర్ జాతీయ కుటుంబ ప్రయోజన పథకం దరఖాస్తులను అడిగి తెలుసుకున్నారు. కాగా నార్కెట్ పల్లి మండలంలో మొత్తం 308 మరణాలు సంభవించగా, జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి 158 దరఖాస్తులు రావడం జరిగిందని, వాటిని పరిశీలిస్తున్నట్లు తహసిల్దార్ ఎంపీడీవోలు జిల్లా కలెక్టర్ కు వివరించారు. తహసిల్దార్ వెంకటేశ్వరరావు, ఎంపీడీవో ఉమేష్, తదితరులు ఉన్నారు.