28-08-2025 07:11:26 PM
గ్రామ పంచాయతీల్లో గల వార్డులు, పోలింగ్ బూత్ ల వివరాలు సరిగ్గా తనిఖీ చేయండి
ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి..
ప్రధానమంత్రి ఆవాస యోజన లబ్ధిదారుల సర్వే వేగవంతం చేయండి..
వన మహోత్సవం లక్ష్యం పూర్తి చేయండి..
జిల్లాలో జ్వరాలు పెరుగుచున్నాయి - పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టండి
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి..
వనపర్తి (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతకై రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుండి ఎలెక్టోరల్ రోల్ పబ్లిష్ కొరకు నోటిఫికేషన్ జారి చేయడం జరిగిందని అందుకు అనుగుణంగా తప్పులు లేని ఎలక్ట్రల్ రోల్ పబ్లిష్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి(District Collector Adarsh Surabhi) ఎంపీడీఓలను ఆదేశించారు. ఆయా మండలంలో ఉన్న మొత్తం గ్రామ పంచాయతీలు, వాటిలో ఉన్న వార్డులు, పోలింగ్ కేంద్రాల వివరాలు ఒకటికి రెండు సార్లు సరిచేసుకొని ఆగస్టు 28న అన్ని గ్రామ పంచాయతీల్లో పబ్లిష్ చేయాల్సిందిగా ఆదేశించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆగస్టు 29న జిల్లా స్థాయి సమావేశం నిర్వహించడం జరుగుతుందని, ఆగస్టు 30 న మండల స్థాయి సమావేశం నిర్వహించుకోవాలని ఆదేశించారు.
ఆగస్టు 30 లోగా డ్రాఫ్ట్ రోల్ లో వచ్చిన ఫిర్యాదులు, అభ్యంతరాలను ఆగస్టు 31న పరిష్కరించి సెప్టెంబర్ 2న తుది ఓటరు జాబితా విడుదల చేయాల్సి ఉంటుందని తెలియజేశారు. గత ఎన్నికల తర్వాత మున్సిపాల్టీల్లో కలిసిన గ్రామ పంచాయతీలను జాగ్రత్తగా చూసుకోవాలని, మున్సిపాలిటీలో కలిసిన గ్రామ పంచాయతీల ఓటర్లు ఇప్పుడు గ్రామ పంచాయతీ జాబితాలో చూపించడానికి వీలు లేదన్నారు. గురువారం సాయంత్రం వరకు అన్ని గ్రామ పంచాయతీలలో ఎలక్ట్రోల్ రూల్ జాబితా ఉంచాలని సూచించారు.
ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి...
ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలనీ ఎంపీడీవోలను కలెక్టర్ ఆదేశించారు. ఇల్లు లేకుండా గుడిసెల్లో రేకుల ఇళ్లల్లో ఉంటున్న నిరుపేదలకు ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, నిజమైన అర్హత ఉన్న వారి పేర్లను ఇందిరమ్మ కమిటీ ద్వారా ఆమోదింప చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణి లో వచ్చిన ఫిర్యాదులను సైతం ఆయా మండలాలకు పంపించడం జరుగుతుందని వాటిని పరిశీలించి అర్హత ఉన్న వారిని ఇందిరమ్మ కమిటీ ద్వారా కలెక్టర్ కు పంపించాలని ఆదేశించారు.
ప్రధానమంత్రి ఆవాస యోజన లబ్ధిదారుల సర్వే వేగవంతం చేయండి
ప్రధానమంత్రి ఆవాస యోజన కింద గ్రామీణ ప్రాంత లబ్ధిదారులకు రూ. 72 వేలు, మున్సిపాలిటీల్లో అయితే రూ. 1.5 లక్ష వరకు ఆర్థిక సహాయం చేస్తుందని, వనపర్తి జిల్లాలో ఇందిరమ్మ ఇంటి కొరకు దరఖాస్తు చేసుకున్న 39,643 దరఖాస్తు దారుల వివరాలు తీసుకొని ఆన్లైన్ లో నమోదు చేయాల్సి ఉంటుందని, ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి పంచాయతీ సెక్రెటరీ రోజుకు కనీసం 5 ఇళ్లు సర్వే చేయాలని నిర్దేశించారు.
వన మహోత్సవం లక్ష్యం పూర్తి చేయండి
జిల్లాలో వర్షాలు బాగా కురుస్తున్నందున ఈ సంవత్సరం వన మహోత్సవం లక్ష్యం మేరకు మొక్కలు నాటే కార్యక్రమం పూర్తి చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద లబ్ధిదారులు పశు కొట్టాలు, సామాజిక ఇంకుడు గుంతలు పూర్తి చేయాలని సూచించారు. ప్రతి పాఠశాల, కళాశాల, మండల కార్యాలయాల ఆవరణలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
జిల్లాలో జ్వరాలు పెరుగుచున్నాయి - పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టండి
ఇటీవల జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నందున జ్వరాలు పెరుగుచున్నాయని, పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎంపీడీఓ లను.ఆదేశించారు. వసతి గృహాలను తరచుగా సందర్శించి పారిశుధ్యం పిల్లల వంటకాల పై పర్యవేక్షణ చేయాల్సిందిగా ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబల కుండ ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ యాదయ్య, పి.డి. డి.ఆర్డీఓ ఉమాదేవి, డి.పి.ఓ రఘునాథ్, పి.డి. హౌసింగ్ విటోభ, అందరు ఎంపీడీఓ లు, ఎంపీఓ లు తదితరులు పాల్గొన్నారు.