15-10-2025 05:13:10 PM
అస్సాం: అస్సాంలోని బక్సా జిల్లాలో బుధవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ సింగపూర్‌లో మరణించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అరెస్టయిన ఐదుగురు నిందితులు ఈవెంట్ ఆర్గనైజర్ శ్యామ్‌కాను మహంత, గాయకుడి మేనేజర్ సిద్ధార్థ్ శర్మ, బంధువు సస్పెండ్ చేయబడిన ఏపీఎస్ అధికారి సందీపన్ గార్గ్, నందేశ్వర్ బోరాతో సహా ఇద్దరు పీఎస్ఓలను ఇవాళ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. నిందితులను జిల్లా జైలుకు తరలిస్తున్న నేపథ్యంలో హింసాత్మక నిరసనలు చెలరేగాయి. గాయకుడి మరణానికి ప్రతిచర్యగా ఐదుగురు నిందితులను తీసుకెళ్తున్న పోలీసు వాహనాలు జైలు ఆవరణకు చేరుకోగానే, జుబీన్ గార్గ్ కు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో జనం గుమిగూడి కాన్వాయ్ పై రాళ్లు రువ్వారు.
ఈ దాడిలో పోలీసు వ్యాన్ సహా అనేక వాహనాలు దెబ్బతిన్నట్లు సమాచారం. పరిస్థితిని శాంతింపజేయడానికి పోలీసులు గాల్లోకి కాల్పులు, టియర్ గ్యాస్ షెల్స్‌ను ఉపయోగించారు. గందరగోళం సమయంలో ఒక పోలీసు వాహనాన్ని కూడా తగలబెట్టారు. మరింత ఉద్రిక్తతలు తలెత్తకుండా ఉండేందుకు అధికారులు జైలు సమీప ప్రాంతాల చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ అదుపులోనే ఉందని అధికారులు తెలిపారు. ప్రముఖ అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ మరణం రాష్ట్రవ్యాప్తంగా విస్తృత ఆగ్రహాన్ని రేకెత్తించింది. మద్దతుదారులు ఈ కేసుపై సమగ్రమైన దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
తన సూపర్‌హిట్ పాట యా అలీతో జాతీయ ఖ్యాతిని పొందిన అస్సామీ సంగీతకారుడు జుబీన్ గార్గ్ సెప్టెంబర్ 19న సింగపూర్‌లో సముద్ర విహారయాత్రలో మరణించారు. 52 ఏళ్ల ఈ కళాకారుడు మరుసటి రోజు నార్త్ ఈస్ట్ ఫెస్టివల్‌లో ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. గార్గ్ సముద్ర విహారయాత్రలో ఉన్నప్పుడు అస్వస్థతకు గురికావడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు అతన్ని ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచిన్నప్పటికీ బ్రతకలేదు. గాయకుడి ఆకస్మిక మరణం అభిమానులను, అస్సామీ సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. భారతదేశ సంగీత పరిశ్రమలో శూన్యతను మిగిల్చింది. మొదట్లో సాహస క్రీడలో ప్రమాదవశాత్తు జరిగిన మరణంలా కనిపించిన ఈ సంఘటన, గాయకుడి భార్య గరిమా, అనేక మంది అభిమానులు ఇందులో అక్రమాలు జరిగాయని ఆరోపించిన తర్వాత హత్య కేసుగా మారింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఐదుగురిని అరెస్టు చేసింది.