సాగుకు ఎగువ మానేరు నీటిని విడుదల చేయాలి

09-11-2026 | 04:01pm

డిసెంబర్ 15 వరకు నీరిస్తే 17 వేల ఎకరాలకు సాగునీరు

నర్మాల మాజీ సర్పంచ్ ఏడబోయిన రాజు డిమాండ్

గంభీరావుపేట,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla district) గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు జలాశయం నుంచి యాసంగి సాగు(Rabi Season Cultivation)కు వెంటనే నీటిని విడుదల చేయాలని నర్మాల మాజీ సర్పంచ్ ఏడబోయిన రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎగువ మానేరు జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 2 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1.75 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు.

మల్లన్నసాగర్ ప్రాజెక్టులో 12 టీఎంసీల నీరు అందుబాటులో ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి అర టీఎంసీ నీటిని ఎగువ మానేరుకు విడుదల చేస్తే గంభీరావుపేట, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట మండలాల్లో సుమారు 17 వేల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని తెలిపారు. రాష్ట్రంలో క్రాప్ హాలిడే ప్రకటించలేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం చొరవ తీసుకుని డిసెంబర్ 15 వరకు ఎగువ మానేరు ద్వారా సాగునీరు అందించాలని కోరారు.

ఈ మూడు మండలాల రైతులు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి నీటిని విడుదల చేయకపోతే ఆయకట్టు రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అలాగే గంభీరావుపేట మండలంలో సాధారణ వర్షపాతం కంటే 40 శాతం తక్కువ వర్షాలు నమోదైనందున మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని ఏడబోయిన రాజు డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు