అర్హతకు మించి వైద్యం.. ప్రాణాలతో చెలగాటం!
- పరాకాష్టకు చేరిన ఆర్‌ఎంపీ, పీఎంపీల వైద్యం
- అవసరం లేకున్నా యాంటి బయోటిక్స్, ఇంజక్షన్లు
- సంగారెడ్డి జిల్లాలో వైద్యం పేరుతో దందా
- నిద్రమత్తులో జోగుతున్న డ్రగ్స్ కంట్రోల్ అధికార యంత్రాంగం
కంగ్టి/ నాగల్‌గిద్ద/ సిర్గాపూర్/ నారాయణఖేడ్, అక్టోబర్ 6 : ఆర్‌ఎంపీ, పీఎంపీ డాక్టర్ల(RMP and PMP doctors) ఆగడాలు మితిమీరిపోతున్నాయి. అర్హతకు మించి వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. సంగారెడ్డి జిల్లా(Sangareddy District) వ్యాప్తంగా గ్రామీణ, మండల కేంద్రాల్లో కేవలం ప్రథమ చికిత్స(First Aid) (ఫస్ట్ ఎయిడ్) చేయడానికి మాత్రమే పరిమితమైన వీరు.. తమ పరిధిని, అర్హతను పూర్తిగా మరిచిపోయి ఏకంగా ఎంబీబీఎస్, ఎండీ నిపుణుల తరహాలో కార్పొరేట్ వైద్యం నడిపిస్తున్నారు.
ముఖ్యంగా నారాయణఖేడ్ నియోజకవర్గం(Narayankhed constituency)లోని కంగ్టి, నాగల్ గిద్ద, సిర్గాపూర్ తదితర మండలాల్లో ఆర్‌ఎంపీల వ్యవహారం జోరుగా సాగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో సరైన ప్రభుత్వ వైద్య సదుపాయాలు(Government medical facilities) లేకపోవడం, ప్రజల్లో ఉన్న అవగాహన లోపాన్ని ఆసరాగా చేసుకుని కొందరు క్లినిక్ల బోర్డులు పెట్టి నిలువునా దోపిడీకి తెరలేపారు. రోగి ప్రాథమిక ఆరోగ్య పరిస్థితిని, పూర్వ చరిత్రను ఏమాత్రం పరిశీలించకుండానే అడ్డగోలుగా మందులు, ఇంజక్షన్లు రాసిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
డోసు మించితే అంతే సంగతులు..
మందుల వినియోగం అనేది రోగి వయస్సు, శరీర బరువు, ఇతర దీర్ఘకాలిక సమస్యల ఆధారంగా అత్యంత జాగ్రత్తగా జరగాలి. అయితే పల్లెల్లోని కొందరు ఆర్‌ఎంపీలు రోగి వచ్చిన వెంటనే రోగ నిర్ధారణ చేయకుండానే చేతికి అందిన హైడోస్ యాంటీబయాటిక్స్, నిషేధిత స్టెరాయిడ్లను కట్టబెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తక్షణ ఉపశమనం కోసం ఇచ్చే ఈ అధిక మోతాదు మందుల వల్ల రోగుల కిడ్నీలు, కాలేయం దెబ్బతినే ప్రమాదం పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మందుల తీవ్రతకు రోగులు ఇతర సైడ్ ఎఫెకట్స్ భారిన పడుతున్నప్పటికీ, గ్రామీణ ప్రజలు ఆ విషయాన్ని గ్రహించలేక మరింత అనారోగ్యం పాలవుతున్నారు.
ఇంజక్షన్ల పేర వసూళ్లు...
పల్లెటూళ్లలో ఇంజక్షన్ వేయించుకుంటేనే రోగం వెంటనే తగ్గుతుంది అనే ఒక బలమైన తప్పుడు నమ్మకం ప్రజల్లో ఉంది. ఈ అమాయకత్వాన్ని కొందరు ఆర్‌ఎంపీలు పక్కాగా క్యాష్ చేసుకుంటున్నారు. సాధారణ జలుబు, దగ్గు, తలనొప్పి వంటి చిన్నపాటి రుగ్మతలకు సైతం ఏమాత్రం అవసరం లేకపోయినా డ్రిప్పులు పెట్టడం, విచ్చలవిడిగా ఇంజక్షన్లు పొడవడం పరిపాటిగా మారింది. ప్రతి చిన్న సమస్యకూ ఇంజక్షన్ అవసరం లేదని మెడికల్ కౌన్సిల్ చెబుతున్నప్పటికీ.. ఒక్కో ఇంజక్షన్కు వందల రూపాయలు వసూలు చేస్తూ రోగుల జేబులకు చిల్లులు పెడుతున్నారు.
డ్రగ్స్ కంట్రోల్ అధికారులు ఎక్కడ?
జిల్లాలోని గ్రామాలు, పట్టణాల్లో పుట్టగొడుగుల్లా వెలిసిన ఆర్‌ఎంపీ క్లినిక్లపై సంబంధిత డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ పర్యవేక్షణ పూర్తిగా కొరవడిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్లినిక్లలో ఎలాంటి మందులను నిల్వ చేస్తున్నారు? వాటిని ఏ ఏజెన్సీల నుంచి కొనుగోలు చేశారు? బిల్లులు ఉన్నాయా లేదా? ఎక్స్పైరీ మందులను రోగులకు అంటగడుతున్నారా? అనే అంశాలను తనిఖీ చేయాల్సిన అధికారులు కార్యాలయాలకే పరిమితమయ్యారన్న విమర్శలు వస్తున్నాయి.
డ్రగ్స్ నిబంధనలకు విరుద్ధంగా ఔషధాలను ఆర్‌ఎంపీలు ఎలా నిల్వ చేసుకుంటున్నారన్నది మింగుడుపడటం లేదు. నిబంధనల ప్రకారం ఫస్ట్ ఎయిడ్ సేవలు మాత్రమే అందించేలా ఆర్‌ఎంపీలపై స్పష్టమైన నిఘా ఉంచాలని, అర్హత లేకుండా ఇంజక్షన్లు, స్టెరాయిడ్స్ వాడే బోగస్ కేంద్రాలపై ఆకస్మిక దాడులు నిర్వహించాలని కోరుతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే నకిలీ వైద్యుల క్లినిక్లను తక్షణమే సీజ్ చేసి, నిర్వాహకులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నారు.