బియ్యం ధరలకు నియంత్రణ కరువు!
- గతంలో రూ. 1,200 ఉన్న బస్తా రూ. 2,400కు చేరిక
- ఎల్నినో వర్షాభావంతో పడిపోయిన దిగుబడులు
- ఇతర రాష్ట్రాల వ్యాపారులతో పోటీపడి అధిక ధరకు ధాన్యం కొనుగోలు
- క్వింటాల్ సన్న బియ్యం ధర గరిష్టంగా రూ. 12 వేలకు చేరిన వైనం
- రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం
జిన్నారం, నవంబర్ 19: ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అన్న నానుడిని గుర్తుచే సుకుంటూ, తినే ప్రతి మెతుకునూ అత్యంత జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన విపత్కర రోజులు వచ్చాయి. మొన్నటివరకు సామాన్యుడికి అందుబాటులో ఉన్న నిత్యావసర బియ్యం ధర(Rice Prices)కు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. కేవలం పదిహేను రోజుల వ్యవధిలోనే మార్కెట్లో బియ్యం ధరలు ఏకంగా వంద శాతం పెరిగిపోయి వినియోగదారుల నెత్తిన పిడుగులా పడ్డాయి. గతంలో 25 కేజీల బియ్యం బస్తా రూ. 1,200 పలకగా, నేడు అది ఏకంగా రూ. 2,400కు చేరడంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు(Middle Class Families) బెంబేలెత్తిపోతున్నాయి.
గణనీయంగా తగ్గిన దిగుబడులు..
బియ్యం ధరలు ఇంతలా పెరగడానికి ప్రధాన కారణం రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులేనని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఎల్నినో ప్రభావంతో వర్షాలు సకాలంలో కురవకపోవడం, సాగునీటి ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు అడుగంటిపోవడంతో వరి సాగు విస్తీర్ణం భారీగా పడిపోయింది. దీనికితోడు రాబోయే రోజు ల్లో భూగర్భ జలాలు ఇంకిపోయి విద్యుత్ కొరత కూడా తలెత్తుతుందన్న ఆందోళనల తో అన్నదాతలు వరి పంటను విస్తృతంగా సాగు చేయలేకపోయారు. దీంతో మార్కెట్లోకి రావాల్సిన ధాన్యం నిల్వలు గణనీ యంగా తగ్గిపోయి వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టించేందుకు ఆజ్యం పోస్తోంది.
ఇతర రాష్ట్రాల వ్యాపారుల పోటీ..
తెలంగాణలో పండిన పరిమిత వరి ధాన్యాన్ని ఇతర రాష్ట్రాల వ్యాపారులు పోటీపడి కొనుగోలు చేస్తుండటం స్థానిక కొరతను మరింత తీవ్రతరం చేస్తోంది. సరిహద్దు రాష్ట్రాల నుంచి వస్తున్న వ్యాపార వర్గాలు క్షేత్రస్థాయికి చేరుకుని రైతులకు అధిక ధరలు చెల్లించి ధాన్యాన్ని పెద్దమొత్తంలో తరలించుకుపోతున్నాయి. ఈ ధాన్యపు తరలింపు ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మన రాష్ట్ర ప్రజలే తినడానికి బియ్యం దొరక్క ఇతర ప్రాంతాలపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడుతుందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రైస్ మిల్లులు, టోకు డిపోల్లో నిల్వలు నిండుకుంటుండటంతో పట్టణ ప్రాంతాల్లో ధరలు మరింత రెట్టింపు అవుతున్నాయి.
సామాన్యుడిపై మోయలేని భారం...
గతంలో క్వింటాల్ సాధారణ బియ్యం ధర మార్కెట్లో రూ. 5,000 నుంచి రూ. 6, 000 వరకు పలకగా, నేడు అది నేరుగా రూ. 10 వేల మార్కును తాకింది. ఇక మా ర్కెట్లో గిరాకీ ఉండే మేలురకం సన్న బియ్యం గతంలో రూ. 8,000 వరకు ఉండగా, ప్ర స్తుతం ఏకంగా రూ. 12 వేలకు ఎగబాకింది. కూలి నాలి చేసుకుని బతికే నిరుపేదలు, స్థిర ఆదాయం గల ఉద్యోగులు నెలవారీ బడ్జెట్లో సగానికి పైగా బియ్యానికే వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొంది. బహిరంగ మార్కెట్లో ధరలు రోజురోజుకూ ఎగుడుదిగుడుగా మారుతుండటంతో వినియోగదారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు.
మార్కెట్ దందాపై నిఘా పెంచాలి...
ఆహార ధాన్యాల కొరతను ఆసరాగా చేసుకుని కొందరు బడా వ్యాపారులు బియ్యాన్ని అక్రమంగా బ్లాక్ మార్కెట్కు మళ్లిస్తూ అధిక లాభాలు గడిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందే రేషన్ బియ్యాన్ని అక్రమార్కులు రీసైక్లింగ్ చేసి ప్రైవేట్ మార్కెట్లలో విక్రయిస్తున్న వ్యవహారాలపై పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్ అధికారులు ఉక్కుపాదం మోపాలి.
బహిరంగ మార్కెట్లలో వ్యాపారులు నిర్ణయిస్తున్న కృత్రిమ ధరలను కట్టడి చేసి, ప్రజలకు అందుబాటు ధరల్లో బియ్యం లభించేలా ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.