విద్యుత్ మోటార్ల దొంగల ముఠా అరెస్ట్

20-11-2026 | 12:26am

రూ.18.44 లక్షల విలువైన 84 మోటార్లు, 4 వాహనాలు స్వాధీనం

ముగ్గురు యువకులతో పాటు నలుగురు బాలుర అదుపులోకి

నర్సంపేట,(విజయక్రాంతి): వ్యవసాయ బావుల(Farm wells) వద్ద ఉన్న విద్యుత్ మోటార్ల(Electric motors)ను దొంగిలిస్తున్న ఏడుగురు సభ్యుల ముఠాను నర్సంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఉదయం రాజుపేట క్రాస్ రోడ్డు వద్ద ఎస్సై రాజన్ బాబు వాహన తనిఖీలు చేస్తుండగా, అనుమానాస్పదంగా పారిపోతున్న ఏడుగురిని సీసీఎస్ పోలీసుల సహకారంతో పట్టుకున్నారు. ఈ వివరాలను ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ మీడియాకు వెల్లడించారు.

డీజే ఆపరేటర్లుగా పనిచేసే వీరు జల్సాల కోసం సులభంగా డబ్బు సంపాదించాలని చోరీల బాట పట్టారు. నర్సంపేట, నల్లబెల్లి, దుగ్గొండి, చెన్నారావుపేట, ఖానాపూర్, నెక్కొండ, ములుగు మండలాల్లోని శివారు గ్రామాల్లో రాత్రివేళల్లో మోటార్లను అపహరించారు.నిందితులు ఇచ్చిన సమాచారంతో రాజుపేట శివారులోని పొదల్లో దాచిన రూ.18,44,800 విలువైన 84 విద్యుత్ మోటార్లు, రెండు ఆటోలు, రెండు బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నిందితులు హంస ప్రశాంత్, అన్న శివప్రసాద్, ఎస్.కె. దస్తగిరిలను అరెస్ట్ చేయగా, మరో నలుగురు బాలురను (సీసీఎల్) అదుపులోకి తీసుకున్నారు. రైతులు తమ మోటార్ల భద్రతపై అప్రమత్తంగా ఉండాలని డీసీపీ సూచించారు. కేసును ఛేదించిన సిబ్బందికి నగదు రివార్డులు అందజేశారు.

మరిన్ని వార్తలు