పేద కుటుంబాలకు అండగా ఇందిరమ్మ కుటుంబ బీమా

14-11-2026 | 08:51pm

వరంగల్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మరో చారిత్రాత్మక సంక్షేమ పథకానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ అన్నారు. అపర చాణక్యుడిగా రాజకీయ దూరదృష్టి కలిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 19వ తేదీన సిద్దిపేట జిల్లాలో ఇందిరమ్మ కుటుంబ బీమా రూ.5 లక్షల పథకాన్ని(Indiramma Family Insurance Scheme) ప్రారంభించనున్నారని తెలిపారు.

ఈ పథకం బీజేపీ పాలిత రాష్ట్రలలో ఎక్కడ లేదని గుర్తుకు చేస్తూ ఈ పథకం ద్వారా రేషన్ కార్డు కలిగిన ప్రతి అర్హ కుటుంబానికి రూ.5 లక్షల బీమా రక్షణ కల్పించనున్నారని, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా సాధారణ మరణం లేదా ప్రమాదవశాత్తు మరణించినా అన్ని రకాల మరణాలకు ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. అర్హత నిబంధనల ప్రకారం రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించడం ద్వారా ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. పేద కుటుంబాల్లో అనుకోని విషాదం చోటుచేసుకున్నప్పుడు కనీసం అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా ఆర్థిక స్థోమత లేని పరిస్థితులను గుర్తించి, ప్రతి కుటుంబానికి భరోసా కల్పించాలనే గొప్ప మానవతా దృక్పథంతో ఈ పథకాన్ని తీసుకురావడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టికి నిదర్శనమన్నారు.

ఈ నెల 19వ తేదీ నుంచి జిల్లా, మండల, పట్టణ, డివిజన్ స్థాయిల్లో అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి కుటుంబ యజమాని, కుటుంబ సభ్యుల వివరాలను సేకరించనున్నారని తెలిపారు. ఇంతటి గొప్ప ప్రజా సంక్షేమ పథకాన్ని ప్రవేశపెడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్, రాష్ట్ర మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ప్రజాప్రతినిధులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన పేరుపేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు చిలువేరు శ్రీనివాస్, వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కొరివి పరమేష్, టిపిసీసీ ఎస్సీ రాష్ట్ర నాయకులు భాషాపాక సదానందం, వర్ధన్నపేట టౌన్ అధ్యక్షుడు ఈగ దామోదర్, 43వ డివిజన్ అధ్యక్షుడు మాడుగుల రాజు కుమార్, కాంగ్రెస్ నాయకులు జన్ను వివేక్, మహమ్మద్ కమలుద్దిన్, రామ యాదగిరి, కొమ్ము శ్రీధర్, చాంద్ పాష, గిన్నారపు రాజు, బండ్ల సురేందర్, ఎర్రం కమల్,  పార్టీ జిల్లా, మండల, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు