పుస్తక పఠనంతోనే విజ్ఞానం, వ్యక్తిత్వ వికాసం
* గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే పాయల్...
ఆదిలాబాద్, నవంబర్ 14 (విజయ క్రాంతి) : జిల్లా కేంద్ర గ్రంథాలయంలో(Central Library) 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు, బాలల దినోత్సవ వేడుకలు(National Library Week celebrations and Children's Day celebrations) శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే పాయల్ శంకర్(MLA Payal Shankar) జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ మల్లెపూల నర్సయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆర్ ఎస్ చిత్రు, మున్సిపల్ చైర్‌పర్సన్ అనూష పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ... ఏఐ, డిజిటల్ మాధ్యమాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ పుస్తక పఠనం ద్వారా లభించే విజ్ఞానం, ఏకాగ్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం గ్రంథాలయంలో మరిన్ని ఏసీలు ఏర్పాటు చేస్తామని, ఇతర మండలాల నుంచి వచ్చే పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించేలా కృషి చేస్తామని తెలిపారు. జీపీఓ, డీఎస్సీ పోస్టుల భర్తీ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తానని పేర్కొన్నారు.
జిల్లాలోని గ్రంథాలయాలను ఆధునిక విద్యా కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నామని, 12 మండల గ్రంథాలయాల పునరుద్ధరణతో పాటు ఏసీలు, కూలర్లు, ఫర్నిచర్ ఏర్పాటు చేశామని తెలిపారు. నవంబర్ 14 నుంచి 20 వరకు నిర్వహించే వారోత్సవాల్లో భాగంగా పుస్తక ప్రదర్శన, వ్యాసరచన, ఉపన్యాస పోటీలు, కవి సమ్మేళనం, రంగోలి పోటీలు నిర్వహించనున్నారు. నవంబర్ 20న ముగింపు వేడుకల్లో విజేతలకు బహుమతులు అందజేయనున్నారు.
కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్లు ప్రకాష్, శ్రీకాంత్, భండారి పోచన్న, జోగు రవి, గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థులు, పాఠకులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.