ఘనంగా వి.జె.ఐ.టి. 24వ స్నాతకోత్సవం
2022–26 బ్యాచ్ విద్యార్థులకు పట్టాలు ప్రదానం
ముఖ్య అతిథిగా తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి
మొయినాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి): హైదరాబాద్‌లోని విద్యా జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(Vidya Jyothi Institute of Technology) (వి.జె.ఐ.టి.)లో 2022–26 విద్యా సంవత్సరానికి చెందిన పట్టభద్రుల(Graduates) కోసం 24వ స్నాతకోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు(Students) సాధించిన విద్యా విజయాలు, కృషి, పట్టుదలకు ఈ వేడుకలు ప్రతీకగా నిలిచాయి.
ఈ కార్యక్రమానికి తెలంగాణ ఉన్నత విద్యామండలి(Telangana State Council of Higher Education) ఛైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి(Balakrishna Reddy) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గౌరవ అతిథులుగా ఎన్.హెచ్.ఆర్.డి. మాజీ జాతీయ బోర్డు సభ్యుడు, హెచ్ఆర్ రంగానికి చెందిన శ్రీకాంత్ సురంపూడి, కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ డేటా అండ్ అనలిటిక్స్, హెల్త్‌కేర్ అండ్ లైఫ్ సైన్సెస్ విభాగం సీనియర్ డైరెక్టర్, గ్లోబల్ డెలివరీ హెడ్ చి. విజయభాస్కర్ పాల్గొన్నారు.
వి.జె.ఐ.టి. ఛైర్మన్ డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి నాయకత్వంలో వేడుకలు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ. సృజన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు స్వాగతం పలికారు. డీన్ (అక్రిడిటేషన్స్ అండ్ ర్యాంకింగ్స్) డాక్టర్ ఎ. పద్మజ, డైరెక్టర్ (ప్లేస్‌మెంట్స్) ఆర్. వెంకటాచలం, వివిధ విభాగాల అధిపతులు, అధ్యాపకులు పాల్గొని పట్టభద్రులకు అభినందనలు తెలిపారు.
డైరెక్టర్ (అకడమిక్స్) జి. శ్రీలత కార్యక్రమ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం పట్టభద్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వృత్తిపరమైన జీవితంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించింది. నైపుణ్యం కలిగిన వృత్తి నిపుణులతో పాటు బాధ్యతాయుతమైన పౌరులను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పునరుద్ఘాటించింది.