పంట నమోదు పేరుతో అక్రమ వసూళ్లు

14-11-2026 | 11:20pm

- సాగు చేయని భూములను సాగులో చూపిస్తూ డబ్బులు దండ 

- రైతులను బెదిరించి ఫోన్ పే ద్వారా నగదు వసూలు 

- విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామన్న వ్యవసాయ అధికారి శివరామకృష్ణ 

కొండపాక, నవంబర్ 14 (విజయక్రాంతి): పంట నమోదు ప్రక్రియలో(Crop Registration Process) అక్రమాలు చోటుచేసుకున్నాయి. పంటలు సాగు(Crop cultivation) చేయని భూములను సైతం సాగులో ఉన్నట్లు నమోదు చేస్తామంటూ రైతుల(Farmers') నుంచి డబ్బులు వసూలు చేసిన ఘటన కొండపాక మండలం బందారం గ్రామంలో వెలుగుచూసింది. పంట నమోదు కోసం నియమించిన యువకుడు సత్తయ్య, రైతులను బెదిరిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

గ్రామ శివారులో సుమారు 500 ఎకరాల భూములు ఇతర ప్రాంతాలకు చెందిన రైతుల ఆధీనంలో ఉన్నాయి. వీరిని లక్ష్యంగా చేసుకుని పంటలు సాగు చేయకపోతే రైతుబంధు తదితర ప్రభుత్వ ప్రయోజనాలు అందవని భయపెట్టి, డబ్బులు ఇస్తే అధికారులతో మాట్లాడి పంట నమోదు చేయిస్తానని నమ్మించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఎకరాల విస్తీర్ణాన్ని బట్టి నగదు, ఫోన్‌పే ద్వారా వసూలు చేసినట్లు సమాచారం. సాగు చేయని భూములను సైతం సాగులో ఉన్నట్లు నమోదు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

బందారం గ్రామంలో మొత్తం సుమారు 3,600 ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా, 2,800 ఎకరాల్లో పంట నమోదు జరిగినట్లు తెలుస్తోంది. మరో 500 ఎకరాల వరకు సాగులో లేని భూములు ఉన్నట్లు సమాచారం. ఈ భూముల నమోదుకు డబ్బులు వసూలు చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారుల దృష్టికి రావడంతో విచారణ చేపట్టారు. శనివారం పలువురు రైతులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు