జిల్లాలో విమానాశ్రయ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

14-11-2026 | 11:24pm
  1. సుజాతనగర్ వద్ద 667 ఎకరాల్లో ఏర్పాటు
  2. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనుడు కూనంనేని
  3. త్వరలో భూసేకరణ, మలిదశ కసరత్తు

భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 13 (విజయక్రాంతి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) ప్రజల ఏళ్ల నాటి కల ఎట్టకేలకు సాకారమవుతూ, సుజాతనగర్ మండల పరిధిలో విమానాశ్రయ నిర్మాణానికి కేంద్ర విమానయాన శాఖ(Union Ministry of Civil Aviation) పచ్చజెండా ఊపింది. సాధ్యం కాదనుకున్న ఎయిర్‌పోర్టు కలను తన అలుపెరగని కృషితో సుసాధ్యం చేసి చూపించిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(Kothagudem MLA Kunamneni Sambasiva Rao) ఘన సాధనపై జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

జిల్లాలోని పెనగడప, పాల్వంచ-దుమ్ముగూడెం, బూర్గంపాడు, దుమ్ముగూడెం, సీతంపేట, సుజాతనగర్ సహా ఆరు ప్రాంతాల్లో భూమి లభ్యత, వాతావరణ, వరద పరిస్థితులపై సర్వే నిర్వహించిన ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) బృందం సుజాతనగర్ వద్ద 667 ఎకరాల స్థలాన్ని తుది ఎంపిక చేసింది. విమానాశ్రయ ఏర్పాటుకు ఇది పూర్తి అనుకూలంగా ఉందని ఫీజిబులిటీ నివేదికను కేంద్రానికి సమర్పించడంతో ఏఏఐ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక సమాచారం అందింది.

గరీబ్‌పేట, సుజాతనగర్ ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టు ఏర్పాటు కోసం ఎమ్మెల్యే కూనంనేని అసెంబ్లీ వేదికగా, ఢిల్లీ స్థాయిలో మంత్రులు, అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ప్రత్యేక చొరవ చూపారు. ప్రజాప్రతినిధిగా తన దృఢ సంకల్పంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం సాధిస్తూ అధ్యయన కమిటీ పర్యటనకు, సానుకూల నివేదిక రావడానికి ఆయన చేసిన కృషి చరిత్రాత్మక విజయంగా నిలిచింది.

సుజాతనగర్ వద్ద ఎంపికైన ఈ ప్రాంతం ప్రధాన రహదారికి 3.4 కిలోమీటర్లు, కొత్తగూడెం రైల్వే స్టేషన్‌కు 5.7 కిలోమీటర్లు, భద్రాచలానికి 35.4 కిలోమీటర్ల దూరంలో ఉండటం ప్రయాణికులకు ఎంతో అనుకూలంగా మారనుంది. ఎయిర్‌పోర్టు రాకతో జిల్లాలో పారిశ్రామిక, పర్యాటక, ఉపాధి రంగాలు గణనీయంగా అభివృద్ధి చెందనున్నాయి.

కేంద్రం నుంచి సానుకూల సంకేతాలు రావడంతో ఇక భూసేకరణ, ఇతర మలిదశ పనులపై కసరత్తు ప్రారంభం కానుంది. అసాధ్యమనుకున్న ప్రాజెక్టును పట్టుదలతో సాధించి జిల్లా అభివృద్ధికి కొత్త బాటలు వేసిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావును పలువురు నాయకులు, మేధావులు, ప్రజాసంఘాల ప్రతినిధులు అభినందిస్తున్నారు.

మరిన్ని వార్తలు