పేదల జీవితాల్లో కొత్త వెలుగులు.. నిరుపేదలకు అండగా ప్రజా ప్రభుత్వం

14-11-2026 | 11:28pm

పెద్దపల్లిలో  5,124 నూతన పింఛన్ల పంపిణీ లో ప్రభుత్వ విప్ విజయ రమణారావు

పెద్దపల్లి, నవంబర్ 14(విజయక్రాంతి): పేదలు, మహిళలు, వృద్ధులు, చేనేత, గీత కార్మికులు తదితర వృత్తిదారుల సంక్షేమమే(Welfare of Professionals) లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు(Peddapalli MLA Chintakunta Vijaya Ramana Rao) అన్నారు. జిల్లా కేంద్రంలో పెద్దపల్లి మున్సిపాలిటీ(Peddapalli Municipality) పరిధిలోని 768 మందికి, పెద్దపల్లి మండలంలోని 1,114 మంది అర్హులైన లబ్ధిదారులకు(Beneficiaries) స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి నూతన పింఛన్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా విప్, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పెద్దపల్లి నియోజకవర్గానికి మొత్తం 5,124 నూతన పింఛన్లు మంజూరయ్యాయని, ఈ నెల 19న ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పింఛన్ నగదు జమ అవుతుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 11 వేలకుపైగా నూతన పింఛన్లు మంజూరు కాగా, వాటిలో 48 శాతం మేర ఒక్క పెద్దపల్లి నియోజకవర్గానికే రావడం విశేషమన్నారు.

అర్హత ఉన్నప్పటికీ చిన్నచిన్న సాంకేతిక కారణాలతో పింఛన్లు పొందలేకపోయిన వారు ఆందోళన చెందవద్దని, సమస్యలను పరిష్కరించి భవిష్యత్తులో అర్హులందరికీ పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వృద్ధులకు ఏప్రిల్ నుంచి కొత్త ప్రక్రియ ప్రారంభించి, 34 నెలల వ్యవధిలో అర్హులైన వారందరికీ పింఛన్లు అందిస్తామని పేర్కొన్నారు.

అలాగే నియోజకవర్గానికి మొదటి విడతలో మంజూరైన 3,500 ఇందిరమ్మ ఇళ్లలో ఇప్పటికే సుమారు 2,700 మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారని, పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, తహసీల్దార్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, సింగిల్ విండో చైర్మన్లు, డైరెక్టర్లు, గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు