బతుకమ్మ.. తెలంగాణ అస్తిత్వం
అమ్మ చేతిలో పూలు.. కూతురి చేతిలో బతుకమ్మ(Bathukamma).. చుట్టూ ఆడపడుచుల వలయం.. అందరి నోట ఒక పాట. బయటికి చూస్తే పండుగ కనిపి స్తుంది. కాస్త లోతుగా చూస్తే ఓ తల్లి జ్ఞాపకం.. ఓ పల్లె జీవితం.. కష్టాలను పాటగా మలిచిన మహిళ.. తరతరాలుగా తన సంస్కృతిని కాపాడుకున్న తెలంగాణ(Telangana) కనిపిస్తుంది. అందుకే బతుకమ్మను ఒక పూల సిబ్బిడిగానే చూస్తే.. తెలంగాణ అస్తిత్వాన్ని(Telangana identity) మనమే మరిచినట్టవుతుంది. ఈ ఏడాదిలో అక్టోబర్ 10 నుంచి బతుకమ్మ సందడి మొదలై.. 18న సద్దుల సంబురంతో ముగుస్తుంది.
పూలను సేకరించడం నుంచి బతుకమ్మను పేర్చడం వరకు, పాటలు పాడటం నుంచి సామూహికంగా వేడుక చేసుకోవడం వరకు ప్రతి అడుగులో కుటుంబ అనుబంధం(Family Bond), మహిళల భాగస్వామ్యం(Women's participation), సామాజిక ఐక్యత(Social Unity) కనిపిస్తాయి. పుట్టింటికి వచ్చిన ఆడపడుచుకు ఇది ఆత్మీయత.. చిన్నారికి కొత్త అనుభవం.. పెద్దలకు బాల్య జ్ఞాపకం. ఒక పండుగ ఇన్ని తరాల జ్ఞాపకాలను తనలో మోసుకోవడం.. బతుకమ్మ ప్రత్యేకత.
పూలలో ప్రకృతి-పాటలో జీవితం..
బతుకమ్మకు ప్రకృతితో గల నేపథ్యం విడదీయలేనిది. తంగేడు, గునుగు, బంతి, చామంతి వంటి పూలతో పేర్చే ఈ పండుగ తెలంగాణ నేల, వానలు, చెరువులు, పల్లె జీవనంతో ముడిపడి ఉంటుంది. వర్షాకా లం ముగింపు దశలో ప్రకృతి అందించే పూలను సేకరించి సామూహికంగా వేడుక చేసుకోవడం.. ప్రకృతిని కేవలం వనరుగా కాకుండా జీవన భాగస్వామిగా చూసిన పూర్వీకుల దృష్టిని గుర్తుచేస్తుంది. అందుకే బతుకమ్మ ప్రకృతి ఆరాధన మాత్రమే కాదు.. ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యతను గుర్తుచేసే పండుగ కూడా. బతుకమ్మను పేర్చేది పూలతోనే.. కానీ దాని అసలు బలం మనుషులను కలిపే అనుబంధంలో ఉంది.
చరిత్రను మోసుకొచ్చిన ప్రజా సంస్కృతి
తెలంగాణ చరిత్రలో అణచివేత, దోపిడీ, సామాజిక అసమానతల కాలాలను మహిళలు కూడా ఎదుర్కొన్నారు. రజాకార్ల హింస, గ్రామీణ ప్రాంతాల్లో దమనకాండ ప్రజల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. ఆ భయానక పరిస్థితుల్లోనూ తెలంగాణ మహిళలు వెనుకడుగు వేయలేదు. తమ కుటుంబాలను, తమ ఆత్మగౌరవాన్ని, తమ నేలతో ఉన్న అనుబంధాన్ని కాపాడుకునేందుకు ధైర్యంగా నిలిచారు.
బతుకమ్మ చుట్టూ మహిళలు కూడి పాటలు పాడటం కూడా సామాజిక జీవితంలో పరస్పర అండగా నిలిచే ఒక సామూహిక వేదికగా నిలిచింది. పుస్తకాల్లో నమోదు కాని కుటుంబ అనుభవాలు..ప్రజల జ్ఞాపకాలను మోసుకెళ్లిన మౌఖిక సంప్రదాయంగా బతుకమ్మ పాటలకు ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మకు కొత్త సామాజిక, సాంస్కృతిక అర్థం ఏర్పడింది. భాష, యాస, పల్లె జీవితం, సంస్కృతి, మహిళా భాగస్వామ్యం, ప్రాంతీయ అస్తిత్వాన్ని వ్యక్తం చేసే ప్రతీకగా కనిపించింది.
నేటి తరానికి బతుకమ్మ చెప్పే పాఠం
ఒక పువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు అది పువ్వే. ఎన్నో పూలు కలిసినప్పుడే బతుకమ్మ అవుతుంది. ఇదే సమాజానికి కూడా వర్తిస్తుంది. వ్యక్తిగత ప్రతిభకు విలువ ఉన్నా సమష్టి సహకారం లేకుండా సమాజం ముందుకు సాగదు. తెలంగాణ సంస్కృతిని గుం డెల్లో మోసే తరం ఉన్నంతకా లం.. మహిళా గౌరవం, ప్రకృతి పరిరక్షణ, సామాజిక ఐక్యతల రూపంలో బతుకమ్మ ఎప్పటికీ జీవిస్తూనే ఉంటుంది.
దుండ్ర కుమారస్వామి