నిత్యజీవితంలో యోగ అవసరం.. ఉచితంగా లభించే ఆరోగ్య దీపిక
బోథ్ నవంబర్ 16 (విజయక్రాంతి): యోగ నిత్యజీవితంలో అవసరమని ఇది డబ్బులు పెట్టి కొనుగోలు చేసేది కాదని ఉచితంగా లభించే ఆరోగ్య దీపిక అనేది ప్రతి ఒక్కరు గుర్తించాలని యోగ శిక్షకురాలు మల్లెపూల విజ్ఞత మౌనికలు పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎస్టీ రెసిడెన్షియల్ బాలికల ఆశ్రమ పాఠశాల(ST Residential Girls' Ashram School)లో యోగ ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా యోగ నేర్చుకున్న 35 మంది విద్యార్థులు నేర్చుకున్న ఆసనాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్ మాట్లాడుతూ యోగా అనేది ప్రతి ఒక్క విద్యార్థి నేర్చుకోవాలని భవిష్యత్తులో వ్యాధులు దరి చేరకుండా ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థులు ప్రతిరోజు అరగంట సమయాన్ని కేటాయిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు.
నిత్యజీవితంలో యోగ ఉపయోగపడడంతో పాటు మానసిక ప్రశాంతతకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. సమావేశంలో పలు ఉపాధ్యాయులు యోగ విశిష్టత గురించి విద్యార్థులకు వివరించారు. రోగాలు వస్తే డబ్బుతో కూడుకున్న చికిత్స చేయాల్సి ఉంటుందని యోగ వల్ల ఉచితంగా ఆరోగ్యం లభిస్తుంది అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన ఆసనాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.