కొనుగోలు కేంద్రాలలో పడిగాపులు
తాడ్వాయి, నవంబర్ 14 (విజయక్రాంతి): ఎంతో కష్టపడి ధాన్యం పండించిన రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. తాము పండించిన ధాన్యాన్ని విక్రయించుకోవాలన్నా అవస్థలు ఎదురవుతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో రైతులు వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ఆరబెట్టారు. అయితే, ఇప్పటికీ అధికారులు ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర (MSP) అందిస్తుందనే ఆశతో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చామని, రాత్రిపూట అక్కడే నిద్రిస్తున్నామని రైతులు తెలిపారు.
వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి 20 రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు చేపట్టడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం మద్దతు ధర అందించి తమకు లాభం చేకూరుస్తుందనే ఉద్దేశంతో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువస్తే ఇక్కడ ఇబ్బందులు తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ప్రభుత్వం ఏ గ్రేడ్ రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.2,461, బీ గ్రేడ్ రకానికి రూ.2,441 మద్దతు ధర ప్రకటించిందని రైతులు తెలిపారు. సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం అదనంగా రూ.500 బోనస్ (Bonus) చెల్లిస్తుండటంతో లాభసాటిగా ఉంటుందని భావించి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చామని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఏడాది అధికారులు కొత్త నిబంధనలు విధిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎలాంటి జల్లెడ పట్టకుండానే నేరుగా వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేవారని, ప్రస్తుతం ధాన్యానికి కచ్చితంగా జల్లెడ పట్టాల్సిందేనని అధికారులు చెబుతున్నారని తెలిపారు. దీంతో తమపై అదనపు ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి కొర్రీలు పెట్టకుండా నేరుగా ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతున్నారు.మండలంలోని ఏండ్రియాలతో పాటు కృష్ణాజివాడి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. తాడ్వాయి మండలంతో పాటు లింగంపేట, రాజంపేట, మాచారెడ్డి, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, నిజాంసాగర్ మండలాల్లోనూ రైతులు ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.