గ్రామస్తుల రిలే నిరాహార దీక్షలు..
సంఘీభావం తెలిపిన కొత్త జయపాల్రెడ్డి
చొప్పదండి, నవంబర్ 16 (విజయక్రాంతి): నారాయణపూర్ గ్రామస్తులు వారి సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు బిఆర్ఎస్ నాయకుడు కొత్త జైపాల్ రెడ్డి(BRS leader Kotha Jaipal Reddy) సంఘీభావం తెలిపారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామస్తులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు సోమవారం నాటికి 100వ రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామస్తులు నారాయణపూర్ నుంచి గంగాధర ఎక్స్ రోడ్ వరకు నల్ల బ్యాడ్జీలు, నోటికి నల్ల మాస్కులు ధరించి ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.
ఈ నేపథ్యంలో గ్రామస్తుల దీక్షలకు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్రెడ్డి సంఘీభావం తెలిపిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ నారాయణపూర్ను ముంపు గ్రామంగా ప్రకటించాలని 100 రోజులుగా గ్రామస్తులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోవడం లేదని, ప్రశ్నించిన వారిపై కేసులు బనాయిస్తూ.. భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే స్థానిక ఎమ్మెల్యే స్పందించి.. సమస్యను పరిష్కరించాలని లేదంటే ఆమరణ దీక్షచేపడుతామని హెచ్చరించారు.