భక్తి శ్రద్ధలతో శివాలయంలో పూజలు..
చెన్నూర్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) చెన్నూర్ పట్టణంలో మొదటి కార్తీక సోమవారం రోజున భక్తులు భక్తి శ్రద్ధలతో శివాలయంలో పూజలు చేశారు. ప్రసిద్ధ శ్రీ అంబా అగస్తేశ్వర శివాలయంకు భక్తులు తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు, అభిషేకం చేశారు.
ఆలయ ప్రాంగణంలో కార్తీక దీపాలను వెలిగించి భక్తిశ్రద్ధలతో స్వామివారిని పూజించుకున్నారు. అనంతరం శివలింగ దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. కార్తీక మాసంలో శివుడిని దర్శించుకోవడం ఎంతో పుణ్యప్రదమని భావించే భక్తులు కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చారు. భక్తుల శివనామ స్మరణతో ఆలయం ఆధ్యాత్మికతో కార్తీక మాస శోభను సంతరించుకోగా, కార్తీక మాసం విశిష్టతను వివరిస్తూ ఆలయ పూజారి మహేష్ మహిళలకు ఉపదేశమిచ్చారు.